పుట:Dvipada-basavapuraanamu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxxiv

వర్ణించిన యేకాంతరామయ్య యతని సమకాలీనుఁ డగు ననియుఁ బేర్కొనుచు నిట్లు నిశ్చయించిరి :

"సోమనాక్షుని కాలము వెనుకకు నెట్టవలయు నని ప్రయత్నించిన వారుకూడఁ బ్రతాపరుద్రుని వదలిపెట్టలేకున్నారు. దానికిఁ గారణ మీ కథలయందు వారికిఁగూడ నమ్మక ముండుటయే. లేకున్న సోమనాథుని కాలనిర్ణయమునకుఁ బ్రతాపరుద్రమహారా జెందులకు ? పైన జెప్పిన మూడుకథలు తప్ప ప్రతాపరుదునితో సోమనాథునకు సంబంధమును గలుపు కథ లేవియుసు లేవు. పైనఁ జెప్పిన గాథలను నమ్మి, కర్ణాటకవి చారిత్రమునందలి కథను సత్య మని భ్రమించి, సోమనాథుని బ్రతాపరుద్రుని కాలములోని వాఁ డనుకొని చరిత్రకారు లందుల కనుపుగ నుండు నట్లు బెలిదేవ వేమనారాధ్యులతో సంబంధించిన కథల నెట్లో సరిపెట్ట యత్నించుటచే నీ వివాదము పెద్ద దయినది. సోమనాథునకు దాదాపు 150 సం|| కాలములో నుండి సోమనాథుని ద్విపద బసవ పురాణమును బద్య బసవ పురాణముగా రచించి యీ గ్రంథమును సోమనాథునికే కృతి యిచ్చినట్టియు, సోమనాథుని శిష్యుఁ డైన కొప్పయ్యకు మనుమని మునుమని కుమారుఁడైనట్టియు, పిడుపర్తి సోమనాథకవి చెప్పిన వాక్యములందు మనము గౌరవ ముంచితిమేని, సోమనాథుఁడు ద్వితీయ ప్రతాపరుద్రుని కాలములోనివాఁ డని యనకతీరదు".[1]

చారిత్రకపురుషుఁ డై, మతప్రవర్తకుఁడై వీరశైవభక్తులకు పరమేశ్వర కల్పుఁడైన బసవేశ్వరుని చరిత్రము ప్రత్యక్ష ప్రమాణప్రతిపత్తి నుండి, ఐతి హాసికకథాకథనస్థాయి కెక్కి, పురాణకల్ప నామహనీయనియన్మండల మందుకొని, సోముని కవితాసుధామందిర మగుట కొక శతాబ్దము పట్టినది. పట్టుట సహజము కూడ: నందీశ్వరావతార మని బసవేశ్వరుని కీర్తించి యతనిని పురాణవ్యక్తిగా నిరూపించి నవ్యవ్యాసుఁ డని వాసికెక్కిన సోమనాథుని బసవపురాణము దేశిచ్ఛందమునఁబడి జనావళి నాకర్షించినను, పండితావళి ప్రమాణ బుద్ధుల కెక్కకపోవుటచే కాబోలు దానినే మారనాదుల పురాణరచనామార్గము ననుసరించి గద్యపద్యాత్మకముగా వచింపఁ బూనుకొనిన పిడుపర్తి సోమనాథునకు పురాణకర్తయగు సోమనాథుని పురాణవ్యక్తిగా మార్చుటకు మఱి యొకటిన్నర శతాబ్దము పట్టినది. అప్పటికి సోమనాథుఁడు ... నందీశ్వరుఁ డగు బసవేశ్వరుని

మతమును పునరుద్ధరించుట కవతరించిన భృంగీశ్వరుఁడు. [2] అతీత భూతార్థ మితిహాస [3] మగునప్పుడు చిరభూతార్థముకదా పురాణమై పుట్టునది !

  1. ఆంధ్ర కవి తరంగిణి సం, 3. పుట. 153, 152.
  2. పిడుపర్తి సోమనాథుని బసవపురాణము. పీఠిక. పద్య. 23, 45. క్రీ. శ. 1560 ప్రాంతమున తొంటద సిద్ధ లింగకవి కన్నడమున పాలకురికి సోమేశ్వర పురాణమే రచించెను.
  3. భోజుని సరస్వతీ కంఠాభరణము: "అతీతార్థ ప్రాధాన్యా దితిహాసః " 2-368.