పుట:Dvipada-basavapuraanamu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxxiii

మొక ప్రతియందు మాత్రమే కలదనియుఁ బెక్కు ప్రతులలో “నానూఱ్ సంద" యని యున్నదనియు కీ. శే. “. చిలుకూరి నారాయణరావుగారు తెల్పి యున్నారు.[1] 1144, 1444 ఈ రెండు సం॥లును చిత్రభానులే కాని ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి -- బుధవార మగుట 1444 సం. ననే పొసగుచున్నది. కావున వారి వాదమును బట్టి సోమరాజు శ. 1444 అనగా క్రీ. శ. 1522 ప్రాంతమువాఁ డగుచున్నాఁడు. అప్పుడు కన్నడ సోమరాజకవి మనకెంత విశ్వాసార్హుఁడో పిడుపర్తి సోమనాథుఁడు నంతే యగుచున్నాఁడు.

పై పక్షము వారి వాదమున గానవచ్చు. ముఖ్యాంశములు మూఁ డని శ్రీ చాగంటి శేషయ్యగారు పేర్కొనియుండిరి. అవి : (1) బెలిదేవ వేమనారాథ్యుని మనుమని శిష్యత్వకథ. (2) మల్లికార్జున పండితారాధ్యుల వంశ పరంపరగాథ. (3) కరస్దలము సోమనాథయ్యకథ. వీనిని సవిమర్శముగా శ్రీ శేషయ్య గారు పరిశీలించి సోమనాథుని కాలమునకు సమన్వయించిరి, సోమనాథుఁడుక్రీ.శ. 1240 - 1320 సం॥ మధ్యకాలమున నుండియుండవచ్చు నని వారు నిర్వహించిన వాదము[2] యుక్తియుక్త మని నాకుఁ దోచినది. ఓరుగల్లులో ఈశ్వరాలయమున బసవపురాణ శ్రవణము, సోమనాథుఁడు తనశిష్యుడైన ఇందుటూరి అన్నయామాత్యుని చేత చెప్పించి పిడుపర్తి శివరాత్రి కొప్పయ్యకు డోకిపఱ్ఱు నగ్రహారముగా నిప్పించుటయు నొకే ప్రతాపరుద్రుని కాలమున జరిగియుండుట నిర్వివాదాంశ మనియు, అన్నయామాత్యుఁడు రెండవ ప్రతాపరుద్రుని పినతల్లియైన రుయ్యాంబయొక్క భర్త యగుటచే ప్రతాపుఁ డనఁగా రెండవ ప్రతాపరుద్రుఁడే యనియు. అందులకు శాసనాధారము లున్న వనియు, డోకిపఱ్ఱు దానకథ అసత్య మనుటకు వీలులే దనియు, అగ్రహారము వడసిన వంశీయులలోని వాఁడగు పిడుపర్తి సోమనాథుని వ్రాతలు సత్యములని గ్రహించుట యుక్తమనియు అందు శివరాత్రి కొప్పయ్య వంశమువాఁ డైన పెదసోమయ్య తన తాత సంపా దించిన యగ్రహారమున కభ్యంతర మేర్పడఁగా ప్రౌఢదేవరాయల (రెండవ దేవరాయలు క్రీ. శ. 1419-1449) నాశ్రయించి డోకిపఱ్ఱు నతనిచే మఱల పొందె నను కథ ద్వితీయ ప్రతాపరుద్ర కాలవాదమున కనువుగా నున్న దనియు, సోమనాథుఁడు ప్రథమ ప్రతాపరుద్రుని కాలమున నున్నచో బసవపురాణమున

  1. పండితారాధ్య చరిత్ర పీఠిక. పుట 8-11.
  2. ఆంధ్ర కవి తరంగిణి సం. 3. పుట 136-154.