పుట:Dvipada-basavapuraanamu.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

252

బసవపురాణము

వెస నేఁగె బిజ్జలునెసకంబు దలఁగఁ
గటకటా ! కఱకంఠు గణములువోవ
గటకంబుభాగ్యంబు గ్రక్కునఁ దొలఁగె;
భూకంప మయ్యెను; భువి నర్ధరాత్రిఁ
గాకు లఱచె : వంటకంబులు వ్రుచ్చె;
ధరఁ బడె సుల్క: లత్తఱి ఱాల వాన
గురిసె; భాస్కరచంద్రపరివేష మయ్యె : 720
దివి దీటుకట్టె: వేసవి మూఁగె మంచు ;
గవిసెను మధ్యాహ్నకాలంబు నందుఁ
గడు నుగ్రరూపుఁ డై కాలుఁడు గానఁ
బడియెను బట్టణ ప్రాంతదేశమునఁ :
బొరిఁ బొరి గవిసెఁ[1] గావిరి యెల్లయెడల ;
ధరణీశ్వరుఁడు గాంచెఁ దలలేని నీడ ;
రవి యుదయించు తత్ప్రస్తవంబునను
దివిఁ బ్రతిసూర్యులు దీపించి; రింక
నెంత గానున్నదో యిటమీఁద ననుచు
సంతాపచితు లై జనులు భీతిల్ల 730
నిక్కడ జగదేవుఁ డింటి కేతేరఁ
జక్కన నామయ్య జనని వీక్షించి
“శివగణద్రోహంబుఁ సెవిఁ బడ్డయపుడు
యవిచారమున వారి హరియింపవలయుఁ ;
జాలరేఁ దారేని నమయంగవలయుఁ ;
గాలకాలుని భక్తగణమార్గ మిధియుఁ
సమయింపఁ జాలక చండి యై తాను
సమయని ప్రాణవంచక కుటిలునకుఁ
గుపితున కజ్ఞున కపజీవితునకు
విపరీతచరితుండు విషమలోచనుఁడు 740
మెచ్చునే ? వానికి మిక్కిలి భక్తి

  1. నల్లనిచాయ.