పుట:Dvipada-basavapuraanamu.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

242

బసవపురాణము

గామారిసద్భక్త గణలింగములకు
నతిభక్తి సాష్టాంగుఁ డై ప్రణమిల్లి :
చతురత సరససం స్తుతిపూర్వకముగ
ముద్రవుచ్చుడును విషోద్రేకవహ్ని
రుద్రుమూఁడవకంటి రౌద్రాగ్ని కరణి
భుగులుభుగుల్లనఁ బొగలి కెంబొగలు
నెగయ విషార్చుల గగనంబుఁ గప్పెఁ ; 430
బటువహ్ని గొని చెడిపాఱె భానుండు ;
నిటయట పడియె నీరేడు లోకములు;
భూలోకమెల్లఁ గల్లోలంబు నొందె ;
వ్రాలి మూర్చిల్లెను జీవంబు లన్నియును ;
నిల మంగలమునఁ బ్రేలలు సిట్లుగొన్న
పొలుపున ధరణిఁ జుక్కలు ద్రెళ్ళిపడియెఁ ;
బొగగొన్నమాత్రన దిగులు సొచ్చుడును
విగతచేతను లైరి దిగధీశులెల్ల ;
నిండె ధూమంబు బ్రహ్మాండమంతయును ;
గొండలు గాటుకకొండలై తోఁచె 440
బడబానలంబున జడధులు గలఁగె;
నడరెఁ గల్పాంతాగ్ని యని బ్రహ్మ వడఁకెఁ ;
నీలవర్ణంబు దా నెక్కొన్ననాఁటి
హాలాహలం బని హరి దల్లడిల్లెఁ : :
గుత్తుకవిష మెట్లొకో పోయె వెడలి
నత్తఱి నని రుద్రుఁ డతిభయం బందె ;
నెగసె రుద్రునిఫాలనేత్రాగ్ని యనుచు
నొగి గణాడంబరోద్యోగంబు దనరె;
నేలయు నింగియు నెక్కొన నిట్టి
హాలాహలాగ్నిమయం బగు నంత.. 450
“మాయీశుభక్తుల మహిమ లిన్నియును
బోయలార ! వినుండు బుడిబుళ్ళు మాని;