పుట:Dvipada-basavapuraanamu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xviii

సోమనాథుఁడు ప్రజాసామాన్యము నుద్దేశించి ద్విపదలో పురాణము నిర్మించెను. దానిని కొందఱు విమర్శించిరి. దానికి సమాధానము విపులముగాఁ బండితారాధ్య చరిత్రలోఁ జెప్పెను. ప్రాసయతి ప్రయోగమునకు ప్రమాణము చూపించెను. పైనఁ బేర్కొనఁ బడిన యైతిహ్యము పండితారాధ్య చరిత్ర రచనకుఁ బూర్వమే సంఘటిల్లె నని తెలియుచున్నది.

జనబాహుళ్యమున కందుబాటులో నుండునట్లు సంస్కృతమునం దనుష్టుప్పులవంటి సులభగ్రాహ్యము లైన శ్లోకములలో పురాణములు రచింపఁబడి యున్నవి. తెలుఁగున నిట్టి సరళసుందర మైన ఛందము ద్విపదగా నెఱింగి సోమనాథుఁడు పురాణము నందులో రచించెను. మతము ప్రజాసామాన్యమునందు వ్యాపింపవలె నను లక్ష్యముతో నిర్మింపఁబడు సారస్వతమున ప్రౌఢకావ్యకళా సృష్టికంటెఁ బ్రజాదరణపాత్ర మగు దృష్టియే యధికముగాఁ గాంచ నగును. సంస్కృతసాహిత్యమర్యాదల నాదరించి యనుసరించు మార్గకవులు తెలుఁగున వెలయునాఁటికే సంస్కృత సాహిత్యమున మహాకావ్య రచనము పరిపక్వ దశ నంది యున్నది. కావున వా రితిహాసము చేపట్టిను , పురాణము ననువదించినను, కావ్యము సంతరించినను వానిని కావ్యాలంకారకళాబంధురములుగాఁ దీర్ప సమకట్టిరి. అందువలనఁ దెలుఁగున కావ్యము తత్కళావిదులను మెప్పించి మనుగడ సాగింపవలసి వచ్చెను. అందుచే జనసామాన్యము కొఱకై న తెలుఁగు ద్విపద పురాణము వారి కాదరపాత్రము కాలేదు. అట్లని సోమనాథుఁడు తన మార్గము వీడలేదు. తన లక్ష్యమును , ఆదర్శమును తేటపఱచి తనకావ్యము నాదృక్కోణముతోఁ జూడు మనినాఁడు. అట్లు చేయనిచో మూలవిచ్ఛేద రూపమగు పాండిత్యమును వెలార్చినట్లే యగునుగదా !

జానుదెనుఁగు:

పై సోమనాథుని స్వతంత్రాశయములు ముఖ్యముగా భాషాసంబంధ మైనవి: ఛందస్సంధ మైనవి. 'ఆరూఢగద్యపద్యాది ప్రబంధపూరిత సంస్కృత భూయిష్ఠ రచన సర్వసామాన్యము కాదు కావున ప్రసన్నతకు జానుఁదెనుఁగు విశేష మని యతని యభిప్రాయము. జానుఁ దెనుఁగునకు తుల్యార్థకములుగా తేట తెనుంగు, తెలుఁగు మాటలు , తిన్నని సూక్తులు అను సమాసములను సోమన వాడియుండెను. అంతియకాక తన వృషాధిప శతకమున జానుఁ దెనుఁగునకు లక్ష్య మగు పద్యము నిట్లు రచించెను.