పుట:Dvipada-basavapuraanamu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xvii

“దేసిగా వచియింతు ద్విపదకు వళ్లుఁ - బ్రాసంబులునుఁ బొందుపడఁగఁ దావలయు
 ననుచుఁ దదీయ సూక్తాక్షరపంక్తిఁ - జెనకక యింతొప్పఁ జెప్పునే యనుచు
 సన్నుతిఁ జేయుచు సత్కవు లలరఁ - దిన్ననిసూక్తుల ద్విపద రచింతు ;
 నదియునుగా కైహికాముష్మికద్వి - పద హేతువవుట ద్విపదనాఁగఁ బరగు
 ద్విపదాంబురుహముల ధృతి బసవేశు - ద్విపదాంబురుహము లతిప్రీతిఁ బూన్తు.[1]

విప్రుని విమర్శనమును, సోమనాథుని యాదర్శమును బొందుపఱచుకొని చూచినచో నిట్లేర్పఱుపవచ్చును : మార్గపద్ధతి ననుసరించువారు గద్యపద్యాది సంస్కృతభూయిష్ఠ రచనతో నొప్పారు చంపూపద్ధతి వలన కావ్యకళాప్రౌఢి యేర్పడు ననియు, తేట తెలుఁగు మాటలకు తత్సమ పదములకు వలె నర్థశక్తి లేదనియు, వానివలనఁ గావ్యమున కుదా త్తత సిద్ధింపదనియు, ద్విపదచ్ఛందము మహాకావ్యరచన కనువైనది కాదనియు, ద్వివదయందుఁ బ్రాసవళ్లు కూర్చుట లక్షణ విరుద్ధ మనియు భావించుచుండిరి. దేశిసంప్రదాయజ్ఞులు - లేక - సోమనాథాదులు సంస్కృత పదభూయిష్ట మైన గద్యపద్యాత్మక ప్రబంధరచనము సర్వ సామాన్యము కాదనియు , కావ్యము సర్వజనసుబోధము కావలయు నన్నచో నది ప్రసన్నము, సరసము నైన తెలుఁగుపలుకుబడితోఁ గూడి, తిన్నని సూక్తులతో నొప్పారు జానుఁదెనుఁగున వ్రాయఁబడవలె ననియు, వేదములందు సంస్కృత మెట్లో, తెలుఁగు కృతులందు తెలుఁగుపలుకు లట్లే గణనీయము లనియు, దేశీయ చ్ఛందములలో గానయోగ్య మై, ఆబాలగోపాలమున కాదర పాత్ర మగు ద్విపదలోఁ గావ్యరచన మొనర్ప వచ్చుననియు; కావ్యకళాప్రౌఢి ఛందమును బట్టికాక ' అల్పాక్షరముల ననల్పార్థరచనము' చేయఁగల కవి దక్షతను బట్టి యేర్పడును గావున గద్య పద్యములవలె ద్విపదలుకూడ నుదాత్త కావ్యరచన కుపకరించు ననియు, మాత్రానుసంధానగణవినీతు లగు జాతు లనియత గణము లనియు, అందు దేశిసంప్రదాయము ననుసరించి యాదిప్రాసతోపాటు

యతినిగాని, ప్రాసయతినిగాని పాటించిన దోసము లేదనియు, భక్తి ప్రధానములగు కృతులం దై హికాముష్మిక ద్విపదహేతువుగా ద్విపద సార్థక మగు ననియు, తత్కావ్యరచనపఠనాదు లొక యారాధన విశేష మనియు దలంచు చుండిరి. మార్గకవులు దేశికవులను ప్రామాణికులుగా గ్రహింపరు. దేశికవులు మార్గ కవులను సరకు సేయరు.

  1. పండితారాధ్య చరిత్ర. దీక్షాప్రకరణము, పుట. 21 - 22.