పుట:Dvipada-basavapuraanamu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xvi

వానిని ప్రచ్ఛన్నముగాఁ గొల్లకొట్టి వీరశైవపురాణము ప్రజల నాకట్టుకొనగల్గు నట్లు నిర్మించెను. ఇట్లనుటచే జైనపురాణలక్షణము లన్నింటిని సోముఁ డనుకరించె నని తాత్పర్యము కాదు. తన గ్రంథప్రణాళిక కొదిగినంతవఱకు వానిని నిపుణముగా గ్రహించి స్వీయప్రతిభతో స్వతంత్ర పురాణ రచనా విధానము నాతఁ డేర్పఱచుకొనెను. బసవపురాణము పుట్టుటతో నాంధ్రమున నార్ష పురాణ రచనా సంప్రదాయ మంతరించుచున్న దనియే కాఁబోలు తిక్కనగారి శిష్యుఁ డైన మారన యోరుగల్లులోనే మఱల పురాణధ్వజ మెత్తెను. ఆ పైన పోతన భాగవతము వెలయించెను. సోమనాథుని పుణ్యమా యని దేశిమార్గ సంప్రదాయములలోఁ బుట్టిన పురాణ తరంగిణుల కోరుగల్లు సంగమ తీర్థ మై తారసిల్లినది I

ద్విపదరచన :-

పైనఁ బేర్కొనఁబడిన యైతిహ్యమున విప్రుఁడు పాల్కురికి సోమనాథుఁడు ద్విపదలో ప్రాసవళ్లను గూర్చి రచించె నని విమర్శించెను. తెలుఁగుసాహిత్యమున కావ్యరచనమున ద్విపదచ్ఛందమును జేపట్టిన మొదటి కవి సోమనాథుఁడు. తత్కారణమును, తత్సార్ధక్యమును సోమనాథుఁడే తనకృతులయందు పేర్కొనియున్నాఁడు.

 
“ఉరుతరగద్య పద్యోక్తుల కంటె - సరసమై పరగిన జానుఁదెనుంగు
 చర్చింపఁగా సర్వసామాన్య మగుటఁ - గూర్చెద ద్విపదలు గోర్కి దైవాఱఁ ;
 దెలుఁగు మాట లనంగవలదు, వేదముల - కొలఁదియకాఁజూడుఁ డిల నెట్టు లనినఁ
 బాటి తూమునకును బాటి యౌనేని - బాటింప సోలయుఁ దాడియకాదె?" [1]

“థేట తెనుంగున ద్విపద రచింతుఁ - బాటిగాఁ దత్కధా ప్రౌడి యెట్లనిన :--
 జాతులు మాత్రానుసంధాన గణవి - నీతులు గాన 'యనియతగణై'ర
 వియును, 'బ్రాసోపా' యనియు, 'యతిర్వా' య - నియుఁ జెప్పు ఛందోవినిహితోక్తి గాన
 ప్రాస మైనను యతిపై వడి యైన - దేసిగా నిలిపి యాదిప్రాసనియతి
 దప్పకుండఁగ ద్విపదలు రచియింతు - నొప్పదు ద్విపదకొవ్యోక్తి నావందు ;
 అరూడ గద్యపద్యాది ప్రబంధ - పూరిత సంస్కృత భూయిష్ఠ రచన
 మానుగా సర్వసామాన్యంబు గామిఁ - జానుఁదెనుఁగు విశేషము ప్రసన్నతకు ;
 అట్టునుగాక కావ్యము ప్రౌఢిపేర్మి - నెట్టన రచియింప నేర్చినఁ జాలు
 నుపమింప గద్యపద్యోదాత్త కృతులు - ద్విపదలు సమమ భావింప"......[2]

  1. బసవపురాణము (సంక్షిప్తము). ప్రథమాశ్వాసము, పం, 165 - 172.
  2. పండితారాధ్య చరిత్ర - దీక్షాప్రకరణము, పుట 18.