పుట:Dvipada-basavapuraanamu.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

186

బసవపురాణము

మసలార విని దర్శనాసక్తిఁ జేసి
భకులుఁ దానును బరమానురాగ
యుక్తులై చనుదెంచుచుండ నొక్కెడను
జాలదోయిట నెత్తి చల్లిన నిసుము
రాలనియట్టి యరణ్యాంతరమున
ముసిఁడివృక్షంబు లొప్పెసఁగ నెల్లెడలఁ
బసిఁడికొండలభాతిఁ బండి వెలుంగ
“నసలార ముసిఁడిపం డ్లారగింపంగ
నెసఁగ లింగములకు నిష్టమైనయది" 690
యనుచు భక్తానీక మానతిచ్చుడును
వినిసంస్మితాననవిలసితుం డగుచుఁ
జనిచని ముసిఁడివృక్షంబుల మొదలఁ
దనకరవా లూని దట్టుఁ డై నిలిచి
'యారగింపవె దేవ !' యని విన్నవింప
వారివారిక గణవ్రాత మేతెంచి
నమృతాంశుధరునకు నర్పించి వేడ్క.
నమృతాంశుధరుభక్తు లారగించుచును
“ముసిఁడిచౌడయ యనుముందటిపేర
యెసఁగుఁబో జగముల నెట్లును నింక " 700
ననుచుఁ ద్రస్తర లాడుచును సంతసమునఁ
జనుదేరఁ గల్యాణమునకు సంప్రీతి
యెసక మెక్కఁగ సంగమేశ్వరునంద
బసవన్న సౌడయ్య భావంబు గాంచి
చక్కన నెదురేఁగి జగతీతలమునఁ
జక్కఁ జాఁగిలఁబడి మ్రొక్కి తో డ్తెచ్చి
యుచితోపచారనియుక్తిఁ గావించి
యచలాత్ము ముసిఁడిచౌడయ్య నేప్రొద్దు
సంగమేశ్వరునంద సద్భక్తిక్రియలు
భంగిగాఁ గొలుచుచు బసవయ్య సలుప 710