పుట:Dvipada-basavapuraanamu.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

155

నింతి పుత్త్రునిఁ జంపు టెఱుఁగనియట్ల
యంతకాంతకమూర్తి యప్పు డిట్లనియె :
"నింతి! నీపుత్త్రుఁడా యింతకమున్ను
నెంతయు నాఁకొని యిట సీరిచిరి 620
యెక్కడ వోయెనో ! యె ట్లున్న వాఁడొ ?
యక్కటా ! డస్సెఁ గదమ్మ ! బాలుండు
కరుణమాలినయట్టి కాంతవు గదవె ?
హరహర ! చెయ్యాడ దారగింపంగఁ :
బెంపమే కానమే బిడ్డలఁ దొల్లి ?
యింపౌనె కీడు మే లింట నేమేని
వండినఁ దిన ; నెట్టివారైన శిశువు
లుండంగఁ దార కైకొండురే యిట్లు ?
కనికరం బింతయు మనసున లేక
వనిత ! మా కేటికీ వడ్డించి తవ్వ ! 630
పసిబిడ్డ లుండంగఁ బాడిగా దిట్లు
మసలక సుతుఁ బిల్వుమా యౌల నివల."
ననవుడు “న ట్లగు నగు నాఁటదాన
ననియె చూచెదవయ్య ! యయ్య నీమాయ
లెఱుఁగుదు నెఱుఁగుదు నే బేలఁ గాను :
కఱకంఠ ! యిది యేల కథలు వన్నెదవు ?
ననుఁ జూచి సిరియాలుఁ డని తలంచితివొ?
పనియులే దారగింపక పోవరాదు ;
ప్రామిఁడియై మేడుపడియెడు దానఁ
గామి నీవెఱుఁగవే [1] కడయింటిపొడువ 640
కామించి సుతుఁ జంపి క్రమ్మఱఁ బిలువఁ
గామారి ! నీయిచ్చు కైలాస మొల్లఁ ;
దనద్రోహమునఁ జేసి తాఁ బోయెఁ బొలిసి ;

  1. వ్యామోహముగల సంసారి. (ఇట సిరియాలునకు విశేషణముగా నన్వయింపఁదగును.)