పుట:Dvipada-basavapuraanamu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

viii

యందును వ్యాపించి యున్న బసవకథార్థములను బ్రోగుచేసి, స్వీయప్రతిభతో వానిని రసవత్తరము లొనరించి, సంవిధానము చెడకుండ వానిని గుదికూర్చి సోమనాథుఁడు పురాణనిర్మాణ మొనర్చెననియు స్పష్టమగుచున్నది. సోమనాథుఁ డీపురాణమును భక్తజనకథామంజరిగా సంతరింప భావించినను అం దైక్య మను సూత్రమును బసవని చరిత్రముతో సాధించుటచే నాతని కావ్యవస్తువునకు ప్రబంధ సౌందర్య మబ్బినది. సోమనాథుఁడే పండితారాధ్యచరిత్రమున భక్తులు తన బసవపురాణ నూతనత్వమును. అం దితిహాసఘటనవలన కథాకథనమున కేర్పడిన ప్రాబంధ్యమును గీర్తించి నట్లు ప్రత్యేకముగఁ జెప్పుకొనెను.[1]

బసవపురాణమును సప్తవర్ణి వలె నేడాశ్వాసముల కావ్యముగా సోమనాథుఁడు భావించెను. అందు ప్రథమాశ్వాసమున 'నందికేశ్వరుఁడు బసవేశ్వరుఁడుగా భువి నవతరించుటయు, నుపనయనసంస్కారమును ద్యజించి వీరమాహేశ్వర వ్రతనిష్ఠుఁ డగుటయు, వివాహితుఁ డై సంగమేశ్వరుని శరణువేఁడుటయు వర్ణిఁపఁబడినవి. ద్వితీయాశ్వాసమున బిజ్జలుఁడు బసవేశ్వరుసకు దండనాయక పద మిచ్చుటయు, కళ్యాణకటకమున బసవేశ్వరుఁడు శివాచారనిరతుఁ డగుటయు, చెన్నబసవఁడు బసవు నారాధించుటయు, అల్లమ ప్రభువు బసవనివిం దారగించి వరము లిచ్చుటయు, బసవేశ్వరుడు తన మహిమలు బ్రదర్శించుటయు, జెప్పఁబడియున్నవి. తృతీయాశ్వాసము జంగమునకు బసవేశ్వరుఁడు తనభార్యచీర నిప్పించి తన జంగమసేవానిరతిని బ్రకటించిన కథతో నారంభమై, సంగయ్య యను ముగ్ధభక్తుని చరిత్రమునకు ముగ్ధుఁడైన చెన్నబసవనికి బసవేశ్వరుఁడు ముగ్ధభక్తుల కథల నెఱింగించుటతో విస్తరించినది. చతుర్థాశ్వాసము మడివాలు మాచయ్య కథతో నారంభ మగును. వీరశైవులు తమబాసలను భక్తి

మహిమతో పాటించి జంగమలింగరూపు లై అనన్యసాధ్యులై వెలుగొందెద

  1. “ఖ్యాతిగా సద్భక్త గణలాలనముగ
     నూతనంబుగ జగన్నుతముగా మున్ను
     “బసవపురాణ” మొప్పగ రచించితివి;
     బసవపురాణ ప్రబంధంబునందు
     ప్రథిత పురాతన భక్తగుణాను
     కథనంబు లితిహాస ఘటనఁ గూర్చితివి;"
    - పండితారాధ్యచరిత్ర - దీక్షాప్రకరణము. పుట 11.
    (ఆం .గ్రం. మా. 30. పరిష్కర్త: డా. చి. నారాయణరావుగారు (1939)