పుట:Dvipada-basavapuraanamu.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

బసవపురాణము

కటకటా ! నాయట్టి కర్మకి నిట్టి
పటునిస్పృహత్వంబు ప్రాప్తవ్య మగునె ?"
యనుచున్న మాదిరాజయ్య గారలను
గనుఁగొని మల్లయ్య గౌఁగిటఁ జేర్చి,
“కర్మవిదూర ! దుఃఖం బింత వలదు
కర్ముల కేల మాకడకు రావచ్చు ?
నీవు మర్త్యమునకుఁ బోవుటకొఱకు
నీ వికల్పము లెల్ల నేమె చేసితిమి ; 1490
ఏమిగారణ మనియెదవేని వినుమ :
యామహాదేవుని యానతిఁజేసి
వసుధకు సద్భక్తి వర్ధనార్థముగ
బసవండు నా నొక్క. భక్తుండు వచ్చి
యున్నవాఁ ; డాతని యుదితగోష్ఠీస
మున్నత సుఖవార్ధి నోలలాడుచును
బరమశివాచారసరణి వట్రిల్లఁ
జరియింపవలయు నిద్దరణిలో నీవు :
ఎనయంగ నార్నూఱునేఁబదియేండ్లు
సనియె నీ విట వచ్చి సంయమితిలక ! 1500
యెన్న నింకేఁబదియేండ్ల కిక్కడికి
నిన్ను రప్పించికొనెద నిక్కువంబు ;
ఇటుగూడ నేడునూఱేండ్లకుఁగాని
యిట యున్కిగానేర దిప్పు డీప్సితము
నేమేనియును వేఁడు మిచ్చెద.” ననుడు
నామల్లికార్జునయ్యకుఁ గేలుమొగిచి
“'శ్రీయందమే పరస్త్రీ నిక్కువంబు
నాయువందమె మాయ కది జన్మభూమి
స్వర్గ మందమె యధ్రువం; బింకమోక్ష
వర్గ మందమె మున్న భర్గునిపదము 1510
ఏమియు నొల్ల నీ వెఱుఁగవే దేవ !