పుట:Dvipada-basavapuraanamu.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

బసవపురాణము

మాకు నీ డై యున్న యీకొమ్మెకాని
చేకొని నఱకంగఁ జెట్టులు లేవె?
శంకమాలితి క్రొవ్వి చక్క మైమఱచి
యింక నాచేత నీ వెట్లు సాఁగెదవు 1430
పాపపుగొల్ల నిన్ బఱతుఁగా" కనుచుఁ
గోపించి తిట్టుడు గొల్లండు నవ్వి,
“బాపురే నిర్వాణి ! బాపురే తపసి !
బాపురే ! బాపురే కోపపుంజంబ
పాపంబు నొందెడు; కోపించువాఁడు
పాపిగా కే నేల పాపి నయ్యెదను ?
స్ఖలియించు కోపాగ్నికణములఁ జేసి
కలఁగదే మానసఘనసరోవరము ?
యెసఁగెడు కోపాగ్ని నింక దే చెపుమ
మసలక హృదయాబ్జమకరందధార ? 1440
వెలువడు కోపాగ్ని వేఁడిమిఁజేసి
నలఁగదే సచ్చిదానందపద్మంబు ?
జ్ఞానంబు సొంపొ ? విచారంబు పెంపొ ?
ధ్యానంబుఫలమొ యీతామసగుణము ?
నా కేమి సెప్పెద , వీ కాననమున
లేకున్నవే చెట్లు నీకుఁ గూర్చుండ ?
నిట్టిశాంతాత్మకు లెచ్చోటఁ గలరు !
పుట్టుదురే నిన్నుఁ బోల సంయములు !
వఱదవోవు నెలుఁగు [1] గొఱుపడం బనుచు
నెఱుఁగక యీఁత కాఁడేగి పట్టుడును 1450
వడిఁ బాఱునెలుఁగంత వానినపట్టఁ
గడనున్న వాఁ 'డోరి! విడువిడు' మనుడు
‘విడిచితి నది దన్ను విడువ' దన్నట్టి
వడువున విడిచిన విడుచునే మాయ ?

  1. కంబళి.