పుట:Dvipada-basavapuraanamu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

vii

తిక్కన యోరుగల్లు దర్శించినప్పుడు ఆ రాజు జైనబౌద్ధులతో సోమయాజిని వాదుచేయించెనఁట! తిక్కన వారి నోడించి వై దికమతమును స్థాపించెనఁట ! అప్పుడు గణపతిదేవుఁడు “జినసమయార్ధుల శిరములఁ దునిమె"ననియు, “విద్వేషబౌద్ధుల విలుమాడె" ననియు సిద్దేశ్వరచరిత్రవలనఁ దెలియుచున్నది. ఓరుగల్లు పతనమునకు జైనమతస్థుల పగయు నొకకారణ మని చారిత్రకులు భావించుచున్నారు. ఇట్లు కాకతీయుల పాలనమున నోరుగల్లులో రాజమతముగా దాదా పొక శతాబ్ది వెలసిన జైనము తన పూర్వగౌరవము నిలుపుకొనుటకొఱకు మఱి యొకటిన్నర శతాబ్దికాలము శైవమతముతో నెదురొడ్డి పోరుచు నంతరించినది. జైనము నెదురించి విజయము సాధించుచున్న శైవము సోమనాథునకు క్రొత్తశక్తిని పుట్టుకతోనే ప్రసాదించి యుండును![1] జైనమతము జనబాహుళ్యమునందు వ్యాపించుట కుపయుక్త మైన వారి పురాణముల విధము సోముని చిత్తముపై కొంత ప్రభావము వై చియుండును. తత్సంస్కారముతో వీరశైవమున కాంధ్ర కర్ణాట జనహృదయసీమలయందు సువర్ణపీఠము కల్పించు బసవపురాణ నిర్మాణము చేపట్టినాఁడు.

వస్తుసంవిధానము :

బసవేశ్వరచరిత్రమే బసవపురాణ ప్రథానేతివృత్తము. సోమనాథుఁడు తన పురాణకథావస్తువును సేకరించుకొనిన విధము నిట్లు చెప్పుకొనినాఁడు .

“ఆతత బసవపురాతన భక్త - గీతార్థసమితియే మాతృక గాఁగఁ
 బూరితం బై యొప్పు పూసలలోన - దారంబుక్రియఁ బురాతనభక్తవితతి
 చరితలలోపల సంధిల్ల బసవ - చరితమే వర్ణింతు సత్కృతి యనఁగ," : [2]
 "ప్రస్తుతింపంగ సద్భక్తి విస్ఫురణఁ - బ్రస్తుతి కెక్కిన బసవని చరితఁ
 జెప్పితి భక్తులచే విన్నమాడ్కి - దప్పకుండ గను యథాశక్తిఁ జేసి,"[3]

ఈ వాక్యములవలన బసవపురాణమున కెట్టి నిర్దిష్ట మైన గ్రంథము మాతృక కా దనియు, శివభక్తుల వాక్కులయందును. పురాతన భక్త గీతార్థముల

  1. “జైన మస్తక విన్యస్త శాతశూల కలిత బిజ్జలతలగుండుగండ బిరుదశోభితుఁడు పాల్కురికి సోమనాభిధుండు" (పీఠిక - 25) అని పిడుపర్తి సోమనాథుఁడు తన బసవపురాణమునఁ గీర్తించెను.
  2. బసవపురాణము (సంక్షిప్తము). ప్రథమ. ఆ పం. 179 -184.
  3. బసవపురాణము (సంక్షిప్తము) - సప్తమ, ఆ, పం, 903 - 906.