పుట:Dvipada-basavapuraanamu.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

107

యనుచు సౌందర్య మహాకాయు లనఁగ
దనుజేశు లతిఘోరతప మాచరింప
నెంతయుఁ బరితోష హృదయుఁ డై భర్గుఁ
డంత దైత్యులకుఁ బ్రత్యక్ష మై నిలిచి
“యాయధోక్షజ కమలాననవాస
వాయతస్వర్గ మోక్షాది భోగములు
చెచ్చెర వేఁడుఁ డిచ్చెద" నని యాన
తిచ్చుడు, సాష్టాంగ మెరఁగి దానవులు 830
“మాజలంధరుఁ డభిమానంబు గొన్న
యాజనార్దను పద మరిదియే మాకు ?
మాగజాసురునిచే మడిసినయట్టి
వాగీశ్వరత్వంబు వలెనె ని న్నడుగ ?
మాతారకునిచే విధూత మై చెడ్డ
యాతని యింద్రత్వ మది యేలచెప్ప ?
నటుగాక వ్యాఘ్రాంధకాది దానవులు
నిటలాక్షు పగతు లై నీచేతఁ దొల్లి
వడసిన మోక్షంబు భక్తిమైఁ దగిలి
పడయుట సోద్దెమే పాన లొం డేల? 840
దేవ ! నిత్యానంద ! దివ్యలింగాంగ !
దేవ ! మహాదేవ : దేవాధిదేవ !
యెల్లదైవత్వంబు లెల్ల భోగంబు
లెల్ల వి యెఱుఁగుదు మొల్ల మేమియును,
నీరమ్య మగు మాశరీరము ల్మీకు
నారగింపంగ నాహారము ల్గాఁగఁ
గరుణింపుఁ" డనుడు శ్రీకంఠుఁ డి ట్లనియె :
“ధరఁ గాళహస్తి భూధరసమీపమున
మృగము లై పుట్టుఁడు ; మిమ్ము వధించి
బగుతుఁ డొక్కఁడు పరిపక్వంబు సేసి 850
యర్పింపనేర్చుఁ గన్నప్పఁ డనంగ :