పుట:Dvipada-basavapuraanamu.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

బసవపురాణము

దల్లి పుచ్చునె సుతు వల్లకాటికిని ?
దల్లి లేకుండినతనయుండు గాన
ప్రల్లదుఁ డై యిన్నివాట్లకు వచ్చెఁ ; 570
జ న్నిచ్చి పలుమాఱు వెన్నయుఁ బెట్టి
పన్నుగా నిన్నియుఁ బాలును బోసి
యాఁకొనఁగాఁ గడు పరసి పాలిచ్చి
సాఁకించి పెనుపదే జనని గల్గినను ?
దా నింతవాఁ డయ్యెఁ దల్లి లేకయును
దా నెంత పెరుఁగునో తల్లిగల్గినను ?
బెండ్లిండ్ల నోములఁ బేరంటములను
బండువుదినములఁ బాటిజాతరలఁ
దగినపోఁడిమి సేయుతల్లి లేకున్న
వగవరే మఱి యెట్టి మగబిడ్డ లైన ? 580
నూర కుపేక్షించి యుండంగఁ దగునె?
యారంగఁ దల్లి నై హరుని నేనై న
నరసెదఁగాక; యి ట్లఱలేక పెనుచు
తరుణియకా దెట్లు దల్లి దా" ననుచు
ననయంబు బెజ్జమహాదేవి దాన
జనని యై పరమేశుఁ దనయుఁ గావించి
[1]తొంగిళ్ల పై నిడి లింగమూ ర్తికిని
సంగన గావించు నభ్యంజనంబు ;
ముక్కొత్తుఁ, జెక్కొత్తు, ముక్కన్నుఁ బులుము,
సక్కొత్తుఁ, గడు పొత్తు నట, వీఁపు నివురుఁ, 590
బెరుఁగంగవలె నని తరుణి వీడ్వఁడఁగఁ
జరణము ల్కరములుఁ జాఁగంగఁ దిగుచు,
నలుఁగులు నలుచు నర్మిలి గట్టిపెట్టి
జలములు వీఁపునఁ జఱచు నంతంత,

  1. తల్లులు చంటిపిల్లలకుఁ దలంటునపుడు వారు పరుండుటకయి దగ్గిఱకుఁ జేర్చి సాచియుంచెడి తొడల పయిభాగము.