పుట:Dvipada-basavapuraanamu.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

81

మన నిత్యపడి వేఁడికొని వేగరమ్ము !"
అనవుడు నట్ల కా"కని పోయి యచటఁ
బడఁతి యబ్బసవయ్య పట్టంపుదేవి
బొడగని, కట్టినపుట్టంబు సూచి,
యసలారఁ బడి వేఁడు డంతఁ జాలించి
మసలక బానిస మగిడి యేతెంచి
“యక్క ! యేమందు నీయాన నే నిప్పు
డొక్క సోద్యముఁ గంటి నక్కడి కేఁగి
యట్టి దివ్యాంబరం బఖిలలోకములఁ
బుట్టదు బసవయ్యపట్టంపుదేవి 90
కట్టిన [1]పటవలిపుట్టంబు సూచి
నెట్టణ నచ్చితి నీ కెఱిఁగింప :
బావ వేఁడినఁ జాలు బసవయ్య యిపుడ
యావస్త్ర మొసఁగెడు నరగలి గొనఁడు;
పరగు మహాదేవభక్తులచేత
నరుదరు దనఁగ గణారాధనములఁ
గొనివచ్చి జంగమకోటి సన్నేహ
మున నిచ్చినట్టి యమూల్యవస్త్రములు
వెంజావళియు జయరంజియు మంచు
పుంజంబు మణిపట్టు భూతిలకంబు 100
శ్రీవన్నియయు మహాచీని చీనియును
భావజతిలకంబు పచ్చనిపట్టు
రాయశేఖరమును రాజవల్లభము
వాయుమేఘము గజవాళంబు గండ
వడము గావులు సరిపట్టును హంస
పడియు వీణావళి పల్లడదట్టి
వారణాసియు జీకు వాయుఁ గెందొగరు
గౌరిగనయమును క్షీరోదకంబు

  1. మేలిజాతివస్త్రము.