పుట:Dvipada-basavapuraanamu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

iii

మను బెలిదేవ వేమనారాధ్యాదుల వలన వినిన పండితుఁడు తనజీవిత చరమావస్థలో నతనిని దర్శింప కల్యాణకటమున కేగుచు, బసవన సంగమక్షేత్రమున లింగైక్య మందిన వార్త మార్గమధ్యమున విని, దుఃఖితుఁడై శ్రీశైలమున కేఁగి యచ్చట జీవితశేషమును గడుపుచు స్వల్పకాలమునకే యాతఁడును శివైక్య మందినట్లు తెలియుచున్నది. పండితుఁడు రచించిన శివతత్త్వసారము వీరశైవమతాచార సంపత్తిని, ఆరాధ్య సంప్రదాయమును బ్రతిపాదించు ప్రామాణిక గ్రంథము. సోమనాథుఁడు మొదట ఆగ్రంథప్రభావమునకు లోనై 'అనుభవసారము'ను రచించి తన కవితావ్యవసాయమును సాగించినాఁడు. ఆపై నాతఁడు శివభక్తకూటములకు సంగమక్షేత్రమైన శ్రీశైలమును దర్శించు సందర్భములందు బసవని గీతములను, అతని మహిమలను విని యుండవచ్చును. క్రమముగా నాతని చిత్త మామహాపురుషుని దివ్యమహిమాభివర్ణనము నం దాయత్త మగుటచే భక్తిప్రపత్తిరూపము లగు పెక్కు లఘుకృతులను జెప్పఁదొడఁగెను. కాని, ప్రసన్న కవితాసుధాధారగల పాలకురికి వాని పలుకుల వెలఁది జిలిబిలియెలు గులతో గడియ కొక్క వృత్తమున నర్తించుచు వస్తుగౌరవము లేని లఘుకృతులతో నాగక మతప్రవక్త మహిమాన్విత జీవితచరిత్రము చిత్రించు పురాణము గానము సేయ సమకట్టినది. దాని ఫలమే ప్రప్రథమాంధ్ర వీరశైవపురాణ మగు బసవపురాణము !

పురాణ విధము : బసవపురాణము ఏ పురాణమునకును అనువాదము కాదు. ప్రసిద్ధ మైన మహాపురాణ సంప్రదాయము ననుసరించి పంచలక్షణవిశిష్టముగా నిర్మింపఁబడినదియును గాదు. కాని పురాణశబ్దముతోఁ బుట్టి ప్రఖ్యాతి నందినది. అది దాని ప్రత్యేకత యైనను పురాణసంప్రదాయజ్ఞులు దానిని విమర్శింపక విడువలేదు . పిడుపర్తి సోమనాథుని బసవపురాణమున ని ట్లొక యైతిహ్యము కలదు :

"ఒకనాఁడు శివభక్తు లోరుఁగంటను స్వయం
               భూదేవుమంటపమున వసించి
 బసవపురాణంబు పాటించి విను వేళ
               హరుని గొల్వఁ బ్రతాపుఁ డచటి కేఁగి
 యాసంభ్రమం బేమి యనుడు భక్తులు బస
               వనిపురాణం బర్ధి వినెద రనిన