పుట:Dvipada-basavapuraanamu.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

బసవపురాణము

బసవండు సద్భక్తిపట్టబద్ధుండు ; 750
అచరలింగంబ నేనచలేంద్రతనయ !
నచరాచరక్షోణిఁ జరలింగ మితఁడు ;
నను నాది నాపేరు శంభుం డనంగ
బొనర ద్వితీయశంభుఁడు వీనిపేరు ;
స్థిరభక్తి మమ్ముఁ గొల్చినఁగాని లేదు
ధర వీనిఁ దలఁచినంతనె ముక్తి గలదు.
అలరుచుఁ బ్రాణదేహార్థముల్ నాకు
నిల నిత్తు రఖిలభక్తులు నొక్కయెడను
నచ్చుగాఁ బ్రాణదేహార్థముల్ బసవఁ
డిచ్చుచు నుండుఁ దా నెల్లభక్తులకు ; 760
నాయతమతి బసవా యనఁ బరఁగు
నీయక్షరత్రయం బి ట్లొక్కమాటు
సదువు నాతని ముఖసదనంబు నందె
కదల కుండుదుము మాగణములు నేము ;
పొదలు నెవ్వని యాత్మ నుదితసద్భక్తి
యదియు బసవనిమహత్త్వంబ కాదె ?
పరికింప నెవ్వఁడు వడయుఁ బ్రసాద
వరముక్తి యది బసవనికృప గాదె !
మదిలోన నెవ్వఁడు మముఁ దలపోయు
నదియెల్ల బసవనియంశంబ కాదె ? 770
పసరించు జంగమభక్తి యెవ్వండు
వసుధలో నది బసవనివృత్తి గాదె ?
భక్తి పట్టము దాల్ప బసవఁడు దక్క
శక్తిసమేతులు జగతిపైఁ గలరె ?
యది గాక యొక్కనాయం దేల భక్త
హృదయస్థుఁ డై చూడ ని ట్లున్నవాఁడు"
అంచు వెండియుఁ బ్రస్తుతించుచు శంభుఁ
డంచితమతి బసవయ్య కి ట్లనియె :