పుట:Dvipada-basavapuraanamu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ii

ఇట్లు మనదేశమున మతప్రవక్తల ప్రత్యక్ష ప్రవచనములకంటె పురాణకర్తల పరోక్ష హితోపదేశములు మతవ్యాప్తికి మధురమార్గముల నావిష్కరించినవి.

ప్రథమాంధ్ర వీరశైవ పురాణము : వీరశైవమతము బసవేశ్వర ప్రవర్తితము . 1 క్రీ. శ. 1162 - 1168 సం. ల మధ్య కళ్యాణకటకము నేలిన బిజ్జలుని కొలువుకూటమున బసవేశ్వరుఁడు మంత్రిగా, బండారిగా నుండి ప్రభుత్వముతోపాటు భక్తిమహిమలఁ బ్రకటించి తనమతమున కెనలేని ప్రాబల్యము గల్పించెను. దక్షిణాపథమున నాతనిమతమునకు విడిదిపట్టులు విరివిగా లభించినవి. బసవేశ్వరుఁ డెంత తత్త్వవేత్తయో అంత భక్తకవి. అందుచే నతడు తనసమకాలికులను స్వీయగంభీరమత ప్రవచనములచే నుత్తేజ పఱచుటతో నాగక తన తరువాతి తరములవారికిని భక్తిరసామృత మందింపఁగల తత్త్వవచనములను గన్నడమునందు లిఖించి యమరుఁ డైనాఁడు. అతని యుజ్జ్వల జీవితాధ్యాయము ముగిసిన తరువాత అతనియొక్కయు, అతని యనుయాయుల యొక్కయు వచనగీతములే యతని కీర్తికి పతాకలై నిలచినవి; తన్మత పోషణకు మాతృక లై వెలసినవి. బసవేశ్వరభానుఁ డస్తమించిన తరువాత నతనికాంతిసారము గైకొని వెలుగొందు భక్తతారకాగణము వెల్లివిరిసినదే కాని సోముఁ డుదయించునంతవఱ కామతజగత్తున సుధాశరచ్చంద్రిక లు లేవు.

బసవేశ్వరుఁడు కన్నడిగుఁడు, పాల్కురికి సోమనాథుఁడు బహుభాషావేత్త యైన తెలుగువాఁడు. ఓరుగల్లునకుఁ బండ్రెండు క్రోసుల దూరమున నున్న పాలకురికి యతని జన్మస్థానము. సోమనాథుఁడు కలము పట్టునాటికి తెలుఁగునాఁట బసవేశ్వర వీరశైవమత సంప్రదాయప్రభావ మున్నను, శైవపండిత త్రయములోఁ దృతీయుఁ డైన మల్లికార్జున పండితారాధ్యుల యారాధ్య సంప్రదాయము బలీయముగా నాటుకొని యుండెను, బసవేశ్వర పండితారాధ్యులు సమకాలికు లయ్యు నొకరినొకరు దర్శించుకొనలేక పోయిరి. బసవేశ్వర మహి

__________________________________________________________________

1. వీరశైవము బసవేశ్వరాద్యుపజ్ఞమే యని కీ. శే. వేటూరి ప్రభాకరశాస్త్రులవారి యభిప్రాయము. (చూడుడు : బ.పు. పీఠిక పుట. 7 8 - 79 ఆంధ్రగ్రంథమాల ప్రచురణము). వీరశైవము బసవేశ్వరోపజ్ఞము కాదనియు, అత్యంత ప్రాచీన మునియు, అది క్షీణదశను బ్రాపింపఁగా బసవేశ్వరుఁ డుద్ధరించి సంస్కరించె ననియు శ్రీ బండారు తమ్మయ్యగారి యభిప్రాయము. (చూడుడు : బ. పు. పీఠిక పుట. 139 - 146, వావిళ్ల ప్రచురణము).