పుట:Dvipada-basavapuraanamu.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

బసవపురాణము

నావీథిఁ జల్లఁ దా నమ్ముచుఁ గణఁకఁ
బోవుచోఁ గాళవ బోయిన దొసఁగఁ
గడురొంపిఁ గాలుజాఱుడుఁ జల్లకడప
పడఁ బోవ గొల్లెత "బసవరో" యనినఁ 640
బట్టితి నచ్చటఁ బడకుండఁ గడవఁ
జట్టన చేతులు సాఁచి యే" ననుచు
గొల్లెతరూపంబు గొల్లెతయిల్లు
గొల్లెత యున్న యిక్కువయుఁ జెప్పుటయు
రప్పించి గొల్లెత రాజు దా నడుగఁ
దప్పక బసవయ్య సెప్పినయట్ల
చెప్పుచు నొఱగినచేతి రొంపియును
నప్పుడు జాఱంగ నంటినకాలి
రొంపియుఁ జూపి, “యెఱుంగరె యితని
పెంపున కిది సెప్పఁ బెద్దయే : తొల్లి 650

—: తిరుచిట్టంబలుని కథ :—


ప్రవిమలభక్తి విభ్రాజితలీల
భువి నఱువత్తాండి మువ్వురిలోన
శ్రీనీలయుఁడు దిరుచిట్టంబలుండు
నా నొక్కభక్తుఁ డనశ్వరకీర్తి
కరమర్థితో వర్ష కాలంబునందు
హరపూజనార్థమై య ట్లొక్కనాఁడు
చని పుష్పములు గోసికొని వచ్చునెడను
వననిధితీరంబునను గాలు జాఱి
పడి వడిఁ బుష్పముల్ వడకుండ భక్తుఁ
డడరుచుఁ “జిట్టంబలాధీశ !" యనుచుఁ 660
బరముఁడు భక్తునిఁ బడకుండఁ బట్టు
పరుసున ననుఁ బట్టె బసవలింగంబు
వడి : నట్టులును గాక వసుదేశ ! వినుము :
పుడమిని సొన్నలి పురవరంబునకుఁ