పుట:Dvipada-basavapuraanamu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

తెలుఁగుకవి తొలిసారిగా నిర్మించిన స్వతంత్రపురాణము బసవపురాణము. అపార శైవమతాభినివేశమునకును. అపూర్వకావ్యరసావేశమునకును సంగమక్షేత్ర మైన పాలకురికి సోమనాథుని హృదయసీమ నుండి యవతరించిన ప్రప్రథమాంధ్ర ద్విపద సాహిత్యభారతి యీ కృతి !

పురాణములు :

సామాన్యముగా నొక జాతియొక్క - లేక - ఒక మతము యొక్క సంప్రదాయములను బలపఱచుటకొఱకు చరిత్ర కందని పురావృత్తములను సముజ్జ్వలాధ్యాత్మిక దృష్టితో సముద్ధరించి వ్యాఖ్యానించు లక్ష్యముతో నిర్మింపఁబడు సారస్వతగ్రంథములు పురాణములు. సంస్కృత పురాణము లజ్జీవి. తత్కర్త లైన యార్షమనీషులు పురాతత్త్వ జిజ్ఞాసువు లై సర్గ ప్రతిసర్గాది మహా విషయములను శ్రుతిస్మృతి పరమార్థానుసంధానవృత్తు లై భావించి, దర్శించి వానిని చతుర్వర్గఫలోపాత్తము లగునట్లు మిత్రసమ్మితములుగాఁ బ్రపంచించిరి : అనంతకాలస్వరూపుఁడై సృష్టిస్థితిలయాత్మకమైన విశ్వసంసార పరిభ్రమణమునకు సాక్షీభూతుఁ డగు పురాణపురుషుని పరతత్త్వమును త్రిభాషల నాశ్రయించి వ్యాఖ్యానించిరి : ఆగమార్థజలసేచనముచే భారతీయ హృదయక్షేత్రముల నార్ద్రీకరించి యార్షసంస్కృతిసస్యములను బండించిరి ; అమూల్య కథానిధులను జూపి మురిపించుచు నమోఘ శాస్త్రవిధులను జెప్పి యొప్పించుచు కవిరసిక ముముక్షు జనములయొక్క. రచనా ప్రసంగ వ్యాసంగముల నుపలాలించు మాతృమూర్తులుగా పురాణములను దీర్చిదిద్దిరి. కావ్యశాస్త్రములవలెఁ గాక పురాణములు జనసామాన్యము నుద్దేశించి రచింపఁబడినవి. కావున మతవ్యాప్తి గ్రంథములు శక్తిమంతము లైన సాధనములుగా గుర్తింపఁ బడినవి. శైవవైష్ణవాది మత శాఖాంతరము లన్నియుఁ బురాణముఖమున జనహృదయసీమలందు వ్యాపించినవి. తత్తన్మత ప్రధానదేవతాకములైన పురాణములు ప్రజల మన్ననల సందుకొనినవి. దానిని గమనించిన జైనబౌద్ధములు పురాణతుల్యము లైన మత గ్రంథములను అవతారకథాసింధువులుగా నిర్మించుకొని జనసామాన్యము నాకర్షించినవి.