పుట:Dvipada-basavapuraanamu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

బసవపురాణము

“నతనిఁ జూచినఁ జాలు నభవునిభక్తి
యతిశయం బగు" నని యరుదెంచువారు,
బసవతీర్థం బేఁగు[1] పరస యనంగ
వసిగొని యిలఁ గ్రిక్కిఱిసి వచ్చువారు-*
ఖండేందుధరభక్తగణము లిబ్బంగిఁ
దండతండంబులు దా రేఁగుదేర.
విలసితమృగమదకలితమార్గముల
వెలుఁగుముక్తాఫలంబుల మ్రుగ్గు లమర 200
ముకురపల్లవమణిముక్తాఫలాది
మకరతోరణములనికరంబు లలర
ఖ్యాతిగా పృషభసమేత మై యొప్పు
కేతనానీకముల్ గ్రిక్కిఱియంగ
నాతతవ్యాసహస్తాకృతి నున్న
వాతపూరణములు వడిఁ గ్రాలియాడ
నుడువీథిఁ గప్పి సమున్నతలీల
నడపందిరులు వెలిగొడుగులుఁ దనరఁ
దతవితతాదివాద్యంబులు మ్రోయ
నతిశయంబుగ విన్కు లంతంత నమరఁ 210
బాయక “చాగుబళా!" యనుశబ్ద
మాయతి నాకస మంది ఘూర్జిల్లఁ
బ్రతిదినంబును భక్త బండారిబసవఁ
డతిభక్తిరతి మతి నంకురింపఁగను
శ్వాశతఘనలింగసంపద మెఱసి
యీశ్వరభక్తుల ని ట్లెదుర్కొనుచు...

—: బసవేశ్వరుని శివాచారనిరతి :—


మంగళహర్షోదితాంగవిక్రియల
సంగతి నాత్మ ముప్పొంగి యుప్పొంగి
భయభక్తియుక్తిఁ దద్భక్తాంఘ్రిచయము
పయిఁ జక్కఁ జాఁగిలఁబడి మ్రొక్కి మ్రొక్కి. 220

  1. యాత్రిక సమూహము.