పుట:Dvipada-basavapuraanamu.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

53

యిట్టివన్నియుఁ దుద ముట్టించుబాస-
బసవనిచరితంబు బసవఁడే యెఱుఁగు
వసమె యెవ్వరికైన వాక్రువ్వఁ దలఁప ?
ధీరంబుకట్ట గంభీరంబుతిట్ట
సారార్థముల ప్రోక జ్ఞానాగ్ని కాఁక 170
ప్రతినలగుడ్డ విశ్రుతభక్తిగడ్డ
వ్రతములపంట వైరాగ్యంబు పెంట
సత్యంబుకలను ప్రసాదంబుకొలను
కృత్యంబుతాఁప యకృత్యాబ్ధితేఁప
వేదాంతములపాటి విద్యలమేటి
నాదంబుక్రోలు సమ్మోదంబుకీలు
శాంతతనెలవు యీశ్వరుకట్టినలవు
దాంతతకలిమి నిత్యత్వంబుబలిమి
వినయంబుతేట వివేకంబుకోట
యనురక్తియిల్లు నుదాత్తత వెల్లు 180
తత్త్వంబుతీఁగ మహత్త్వంబుచేగ
సత్త్వంబు వెన్ను నాస్థానంబుచెన్ను

—: బసవేశ్వరుని దర్శింప శివభక్తు లరుదెంచుట :—


బసవఁడు కేవలభక్తుండె? యనుచు
వసిగొని లోకముల్ వర్ణనసేయ
నొక్కొక్కనియమంబు నిక్కంబు గాఁగఁ
జక్కన దర్శింపఁ జనుదెంచువారు,
చేకొన్నవ్రతములు చెల్లించు వారు,
ప్రాకటవ్రతబుద్ధిఁ బఱతెంచువారు,
“ఖ్యాతుఁడో భక్తి సమేతుఁడో యరసి
చూతముగాక !" యంచును వచ్చువారు, 190
“బసవనిచేఁ బూజ వడయుద" మనుచు
నెసకంబు దళుకొత్త నేతెంచువారు.