ఈ పుట అచ్చుదిద్దబడ్డది
32
ద్విపదభాగవతము
సకలసంపదలకు సదనమై పొలుచు
నకలంకగతి మందకరిగె నుద్ధవుఁడు
తనరాక నెరిగింపఁ దగ నందుఁ డెదురు
నందుఁడు ఉద్ధవుని పూజించి శ్రీకృష్ణునివృత్తాంత మడుగుట
చనుదెంచి యతనికి సాష్టాంగ మెఱఁగి
కొనిపోయి పెక్కుభంగులఁ బూజసేసి
యనుపమప్రీతిమై నప్పుణ్యధనుని340
యలవడ మజ్జనయాహారవిధుల.
వలయకఁ దీర్పించి యతని కిట్లనియె.
"దేవకియును వసుదేవుఁడు సుఖులె?
కోవిదగ్రామణి కొడుకులుఁ దాను
సురచిరప్రీతిమై సుఖమున్నవాఁడె?
హరి మమ్ముఁ దలఁచునే యప్పటప్పటికి?
సురలోకవైరిఁ గంసుని నేలఁగూల్చి
ధరణిరాజ్యము వానితండ్రికి నొసఁగి
యన్నయుఁ దమ్ముఁడు నతులితప్రేమ
నున్నారె సౌఖ్యులె, యుద్ధవాచార్య
బలురక్కసులబారిఁ బడి చావనీక
చెలఁగు మహాదావశిఖి గ్రాఁగనీక
యహివిషానలవహ్ని నడగంగనీక
మహనీయమగువాన మడియంగనీక
యప్పటప్పటికి మమ్మరసి గండములు
దప్పించి రక్షించె దానవారాతి.