పుట:Dvipada-Bagavathamu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

ద్విపదభాగవతము

శ్రీకృష్ణుఁడు యమలోకమునకు వెళ్ళి గురుపుత్రుని యసువులను దెచ్చుట


కాలుని పురము దగ్గర వచ్చి శౌరి
కాలమేఘధ్వనిగతి శంఖరవము
సేసిన, యముఁడు గాసిల్లి యేతెంచి
యాశౌరి బొడగాంచి యర్థి పూజించి
“యేమి వేంచేసితి రిందిరాధీశ!
నామీద కృపఁ జేసి నా కెఱింగింపు”
మనవుఁడు “గురుపుత్రు నక్కటా! ఏల
కొనివచ్చినాఁడవు? కోరి నాకొసఁగు”
మనవుఁడు సమవర్తియు విప్రతనయుఁ
గొనివచ్చి వెస లోకగురునకు నిచ్చె
ఏపార జమునింటి కేఁగిన సుతుని
కోపించి లావునఁ గొనివచ్చి శౌరి
గురులముందటిఁ బెట్ట గోవిందుఁ జూచి
హరుషనిర్భరచిత్తుఁడై పలికె నతఁడు320
“భూరిసత్వాఢ్యులు పుణ్యమానసులు
కారణపురుషులు గారె? ఎవ్వరికి
జమునిల్లుఁజొచ్చినఁజత్తువుఁ దెచ్చు
నమితసత్వాఢ్యు లీయవనిలో గలరె?
నాకోర్కిఁ దీర్చితి నాపుత్రు నిచ్చి
యాకల్పసుఖలీల యవుగాక మీకు”.
అనియర్థి దీవించి యవ్విప్రవరుఁడు
తనర వీడ్కొల్ప నిద్దఱు రథం బెక్కి
యమరపట్టణతుల్యమైపోల్చు మధుర
కమరలోకార్చితు లరుదెంచి రెలమి.