వీటినన్నిటిని విచారించి చూడఁగా మడికి సింగన్న 1430వ సంవత్సరము వఱకైనను జీవించి యుండును. [ఆంధ్ర॥ కవు॥ చరి॥ ప్ర॥ భా॥ 378 పుట]
మడికి సింగనార్యుఁడు 1420కిఁ బూర్వమే భాగవత దశమస్కంధమును రచించినట్లు తెలియుచున్నది. కాఁబట్టి పోతనామాత్యుని భాగవతమునకు ముందుగా రచింపఁ బడినది మడికి సింగనార్యుఁని భాగవత దశమస్కంధ మనుటలొ సందేహముండదు.
సింగన్న నియోగి బ్రాహ్మణుఁడు భారద్వాజ గోత్రుఁడు. అయ్యల మంత్రివరునకును సింగాంబికకును జన్మించినవాఁడు. సింగన్నకృతమగు వాసిష్ఠ రామాయణములోని యీక్రింది పద్యములను గమనింపుడు.
సీ॥
“అతండు తిక్కనసోమయాజుల పుత్రుఁడై
కొమరారు గుంటూరి కొమ్మ విభుని
పుత్రి చిట్టాంబిక బుధలోక కల్పక
వల్లి వివాహమై వైభవమున
భూసారమగు కోటభూమిఁ గృష్ణానది
దక్షిణ తటమున ధన్యలీల
నలరు రావెల యను నగ్రహారము తన
కేక భోగంబుగా నేలుచుండి
యందుఁ గోవెల గట్టి గోవిందు నెన్న
గోపీనాథుఁ బ్రతిష్టయుఁ గోరి చేసి
యఖిల విభవములందును నతిశయిల్లె
మనుజమందారుఁ డల్లాడ మంత్రివిభుఁడు.