Jump to content

పుట:Dvipada-Bagavathamu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మధురకాండము

25

సుతులఁ గౌఁగిటఁ జేర్చి శోకంబుఁ దక్కి
యతులితంబగు ప్రేమ నందఁదఁ జూడ
వసుదేవుఁడును బుత్రవరుల నీక్షించి
యసమానమగుప్రేమ నక్కునఁ జేర్చి
“పుణ్యాత్మ! మీయట్టి పుత్రులఁ గాంచి
పుణ్యకీర్తులఁ గంటి పుణ్యుఁడ నైతి;260
నింతగాలము మిమ్ము నీక్షింపలేక
సంతాపమందుచు శత్రులచేత
బడని బాధలఁ బడి పసువుచుండితిమి;
కడపట! నినుఁ జూడగంటిమి నేడు;
జన్మజన్మాంతరసంచితౌఘములు
చిన్మయ! నినుఁ దలఁచిన మాత్రమేఁగు.
మహనీయ! నీవు కుమారుఁడ వైతి
విహపరంబుల మాకు నేమిటఁ గొఱత?”
అనియున్న గురుల నత్యాదరలీలఁ
గనుఁగొని శౌరి యుత్కటబాష్పుఁ డగుచు

శ్రీకృష్ణుఁడు తల్లిదండ్రులఁ జూచి చింతించుట


“మానిమిత్తముల దుర్మనుజులచేతఁ
బూని బహుక్లేశములు మీకుఁ గలిగె;
జనియించినపుడే యిచ్చటనున్న వెఱచి
యనఘ! నందునియింటి కనిచిన, వారు
బాల్యంబు మొదలుగా భక్తిఁ బోషింపఁ
గౌల్యవర్తనల మెలఁగి కాంచితిఁ గాని
యప్పటప్పటికి మమ్మరసి మీ రర్ధిఁ
జెప్పిన పనిసేయ సిద్ధించదయ్యె;