పుట:Dvipada-Bagavathamu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

ద్విపదభాగవతము

ఘనదీర్ఘబాహుల, కఠినవిక్రముల
వనజాతనేత్రుల, వసుదేవసుతుల,
నారామకృష్ణుల, నతులవిక్రముల,
నారూఢనవయౌవనాంగులఁ జూచి160
భోరున జనులెల్లఁ బొగడఁగఁ గంసు
డారవ మాలించి యటఁ జూచునంత;
కువలయపీలంబుఁ గూల్చి తన్నర్థి
కువలయంబంతయుఁ గొనియాడవచ్చు
హరికామపాలుర నందందఁగాంచి
తిరుగుడువడి గుండె దిగులొంది తాల్మి

కంసుఁడు చాణూరముష్టికులను శ్రీకృష్ణునిపైఁ బోరబంపుట


డింది చాణూరముష్టికుల రప్పించి
దందడిఁ బెదవులు దడపుచుఁ బలికె,
"మనమంటపము సొచ్చి మనవిల్లు విడిచి
మనపట్టపేనుఁగ మడియించి వీరు
మనమీఁద వచ్చిరి మహితవిక్రములు.
తనరార మల్లయుద్ధము నేర్పు మెఱసి
పోర మీరిరువురుఁ బొలియించి వేగ
నారాజ్యమును నన్ను నాబంధుజనుల
రక్షించి నాదుసామ్రాజ్య మెంతయును
నక్షయంబుగ నేలుమ”ని పల్కుటయును ;
తివిరి యుక్కున దాత తీర్చినయట్ల
ప్రవిమలంబగు మహాప్రతిమలో యనఁగ