పుట:Dvipada-Bagavathamu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అప్పకవి వంటి లాక్షణికుఁడు మడికి సింగనార్య కృతమగు వాసిష్ఠరామాయణములోని రెండు పద్యములను “అప్పకవీయము” లో నుదహరించి యున్నాఁడు.

——:ముగింపు:—

సరస్వతీమహల్ లైబ్రరీలోని తెనుఁగు వ్రాతప్రతుల సంఖ్య సుమారు 816 ఉన్నవి. ఇవి తంజావూరాంధ్ర నాయక రాజుల కాలమునుండి వచ్చుచున్నవి. నాయకుల పరిపాలన హూణశకము 1535—1675 వఱకు సాగినది. తరువాత మహారాష్ట్ర రాజులు తంజావూరును బరిపాలించిరి. నాయకరాజులలో “రఘునాథ నాయకుఁడు”. అతని కుమారుఁడు “విజయరాఘవ నాయకుఁడు”. ఈ యిద్దఱును తంజావురాంధ్ర సాహిత్యమునకు జీవగఱ్ఱలై యుండిరి. స్వయముగా గూడ అనేక గ్రంథములను విరచించిన ప్రజ్ఞానిధులు వారు. మహారాష్ట్ర రాజులలో గూడ తెనుఁగు సాహిత్యము కొనసాగినదే కాని మొరడు పోలేదు. మహారాష్ట్ర రాజులైన ఏకోజీ, శాహ మహారాజులు స్వయముగా తెనుఁగు ప్రబంధములను వ్రాసిన మేధావులు. లైబ్రరీలోని తెనుఁగు గ్రంథములను ఈవిధముగా విభజించవచ్చును.

  1. పద్యకావ్యములు
  2. ద్విపదకావ్యములు
  3. శతకములు
  4. దండకములు
  5. గానములు
  6. నాటకములు (యక్షగానములు)