మధ్యత్వము, యత్ఫుల్లతామరసాక్షులు, దేవకన్యలతో గూడ నీడుఁబోల్పగారాని లావణ్యము మృదువుగాను క్లుప్తముగాను నాటునట్లు వాక్రుచ్చెను. పిమ్మట సమస్తగుణగణములతో విరాజిల్లు శ్రీకృష్ణునియందు ఆమెకున్న మోహపాశమును వివరించెను. శ్రీకృష్ణుని విరోధి యామెను బెండ్లాడ నిశ్చయమైనందున దనరాకకు ముఖ్యకారణమని నొక్కి చెప్పెను. కొసకు “ఆభామ నిజభార్యయై యుండునట్టి సౌభాగ్య మెవరికి సమకూరు?” అని ప్రశ్నించి శ్రీకృష్ణుని యుత్సాహమును రేకెత్తించెను. చూచితిరా కవి చాతుర్యము! చాతుర్యముతోపాటు కవితాధార మిట్టపల్లములులేని నడకతో సొంపుగా సాగెడు తీరును గమనింపుడు!
అదే సందర్భమందుఁ బోతనార్యుని వర్ణన యించుక గమనింపుడు.
సీ॥ “పల్లవవైభవస్పదములగు పదములు
కనకరంభాతిరస్కారు లూరు
లరుణప్రభా మనోహరములు గరములు
కంబు సౌందర్యమంగళము గళము
మహితభావాభావ మధ్యంబు మధ్యంబు
చక్షురుత్సవదాయి చన్నుదోయి
పరిహసితార్ధేందు పటలంబు నిటలంబు
జితమత్త మధుకర శ్రేణి వేణి
భావజాశుగముల ప్రావులు చూపులు
గుసుమకరుని వింటి కొమలు బొమలు
చిత్తతోషణములు చెలువ భాషణములు
జలజనయనముఖము చంద్రసఖము”.