Jump to content

పుట:Dvipada-Bagavathamu.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156

ద్విపదభాగవతము

నని చెప్పుటయు విని యభిమన్యసుతుఁడు
వినుతుఁడై శుకయోగివిభునకిట్లనియె.
“ఘనపుణ్యుఁడగు హరి కల్యాణకథలు
విని కృతార్థుఁడనైతి విష్ణుఁడు మరియు
ధారుణి పాలించి ధర్మవర్తనుల
నేరీతి విహరించె? నెఱిఁగింపు”డనిన
మధువైరికథలవాఙ్మనసగోచరము
లధిప! ఏర్పడ వినుమని చెప్పదొఁడగె.
అని యిట్లు నిత్యధర్మారంభుపేర
జనలోకనవపారిజాతంబుపేరఁ
జతురకళాపూర్ణచంద్రునిపేర
నతులవైభవనిర్జరాధీశుపేర
శోభితనవరూపసూనాస్త్రుపేర
నౌభళమంత్రికందామాత్యుపేరఁ
గోరి భరద్వాజ గోత్రసంజాతు
డారూఢమతి నయ్యలార్యనందనుఁడు
శృంగారరసకళాశ్రితవచోధనుఁడు
సింగనామాత్యుఁడు చెలువగ్గలింప1050
సలలితరసభావశబ్దగుంభనల
వలనొప్ప శ్రీభాగవతపురాణమున
మహనీయమగు దశమస్కంధసరణి
విహితలీలలనొప్పు విష్ణుచారిత్ర
మారూఢభక్తి కల్యాణకాండంబు
నారవితారార్కమై యుండఁజెప్పె.1053

కల్యాణకాండము సమాప్తము.