ఈ పుట అచ్చుదిద్దబడ్డది
కల్యాణకాండము
137
ఏతరుణులయందు నిటువంటి తలఁపు
యే తెఱంగునఁ జూచి యెఱుఁగము వినము,
నీకేల ముచ్చట? నీకేల బెగడ?
నీకేల వెనుఁబడ నీరజవదన?
మూఁడు లోకంబుల ముదితయేఁదొల్లి
పాడిగా నెఱుఁగని పురుషులు లేరు;
నా కౌసలంబున నరవరోత్తముల
నీకుఁ జూపెదఁ జూడు నిఖిలలోకాన!
వచ్చి పొందిన భూపవరుని నీమ్రోలఁ
దెచ్చి పెట్టెద నింత ధృతిఁ జిక్కఁబట్టు”
మనిపల్కి నవ్వుచు నాచిత్రరేఖ
పనుపడ నొక చిత్రపటము సంధించి
సకలలోకంబుల జననాథసుతుల
నకలంకమతి వ్రాసి యబలతో ననియె.
“నీతలఁపుననున్ననృపకులోత్తంసుఁ
డేతెఱంగో వ్రాసితిటుజూడు” మనుచు;830
పాతాళవాసులఁ బన్నగాధిపులఁ
జాతుర్యగుణుల రాక్షసకుమారకుల
నలకూబరాది యున్నత యక్షవరుల
నలజయంతాదుల నసురాధిపులను
గరుడఖేచరసిద్ధగంధర్వవరుల
వరుసతో వేర్వేర వనితకుఁ జూపి;
ఆలోనఁ గురుపాండవాదులఁ జూపి;
యాదవవీరుల నందఱఁజూపి;