తెనుఁగు సారస్వతరథ మొక్కొక్క శతాబ్దము నందొక్కక్క పోకడను గల్గి సాగినది. నన్నయాదుల కాలము ప్రాయికముగా సంస్కృతములోని పురాణేతి హాసములను దెనుంగు భాషలో ప్రచారమునకుఁ దీసుకొని వచ్చునదిగానుండెను. పెద్దనాదుల కాలమందు దెనుఁగు సారస్వతముయొక్క పోకడ మారినది. ఒక చిన్న కథా వస్తువునుఁ దీసుకొని పెంచి వన్నెలు చిన్నెలు దిద్ది స్వతంత్రముగాఁ బ్రబంధ రచన యాకాలమందు సాగినది. తరువాతికాలపు కవులు రెండు విధములైన పోకడలను ననుసరించుటలోనే నిమగ్నులై యుండిరి. ప్రతిభావంతులగు మహాకవులందఱును భాషాంతరీకరణము నందును, శృంగారాది వర్ణనలయందును నిమగ్నులై తమ యమూల్యమైన భాషాజ్ఞానమును గవితాశక్తిని చెక్కడపు పనులతో నగిషీకూర్చిన చక్కని పెట్టెలలో నిమడ్చి బంధించిరేకాని స్వేచ్ఛగా నడచుట కవకాశ మిచ్చినవారు కారైరి! వారు తమతమ నాయకానాయికల వర్ణనలయందు చాతుర్యమును జూపుటలోఁ గన్పఱచిన కవితా శక్తిని ఆయాయీ కాలములందుండిన దేశీయ జీవన ప్రతిపాదకములగు విషయము లందుఁ గన్పఱచి యుండినచో నాంధ్రభాషాయోష సర్వాంగ సుందరియై యుండును గదా! ఈ విషయములో నన్నయాదుల భాషాయుగమే కొంతమెఱుఁగని నాస్వాభిప్రాయము. ఏలనన భారతభాషాంతరీకరణము తెనుఁగు జాతీయ కవిత్వమును బోషించుటయే గాక మానవ జీవితమున కావశ్యకములగు యనేక యుపాఖ్యానములతోఁ జదువుచున్నకొలఁది చదువవలయునని యాసక్తిని గల్గించునదిగా నున్నది.
మడికి సింగనార్యుఁడు నన్నయాదులయొక్క పోకడ ప్రధానముగాఁ గల్గిన కవిసత్తముఁడు. ఇతఁడు నన్నయ తిక్కనలఁ దక్క నెవరిని స్తుతి యొనరించినవాఁడు కాఁడు.