ఈ పుట అచ్చుదిద్దబడ్డది
కల్యాణకాండము
109
అర్జును రథసూతుఁడై తోడువచ్చి
నిర్జరాధిపునాజ్ఞ నెదరి ఖాండవము
హుతవాహనునికి నాహుతిగా నొనర్చి
యతనిచే గాండీవమనుపేరి ధనువుఁ
దఱుగని యమ్ములుఁ దరుచర ధ్వజము
వఱలెడు రథమును వాజులుఁదెచ్చి
నరునకు నిచ్చె; నానరు చేత మయుఁడు
దరికొను ఖాండవ దహనంబుఁ బాసి510
బ్రదికి సభామంటపంబును గట్టి
గదయు శంఖమునిచ్చి కడుభక్తి నరిగె.
హరియును రథమెక్కి యతివయుఁ దాను
దరమిడి చనుదెంచె ద్వారకాపురికి;
సాత్యకి నరుతోడ శస్త్రాస్త్ర విద్య
నత్యుదాత్తత చేర్చి హరిఁ గొల్చివచ్చె;
హరియుఁ గాళిందియు నసమాస్త్రుకేళి
సరస సౌఖ్యక్రీడ సలిపి రింపొంద.
మిత్రవిందాపరిణయము
వారక నాలో నవంతిభూపతులు
వీరులు విందానువిందులు ప్రేమఁ
దమ ముద్దు చెలియలి ధవళాయతాక్షి
విమలేందువదన సంవ్రీడనిదాన
నారూఢలీల స్వయంవరోత్సవము
గారవంబునఁ జేయగాఁ గృష్ణుఁడెఱిఁగి
చని భూపతులనెల్ల జడిసిపోఁద్రోలి