కల్యాణకాండము
97
వంతుఁడు మురవైరివక్షంబుఁ బొడువ
నంతకాకారుఁడై హరి వానిఁ దాఁకె.
ఇరువురు నీరీతి నిరువదిదినము
లురువడి పోరాడి యొగి కైటభారి
భల్లూకపతిగుండెఁ బగులంగఁ బొడువ
నొల్లనొల్లన వోయి యురుమూర్ఛఁ దెలిసి
యేయుగంబులయందు నీరీతిఁ దొడరి
పాయకిర్వదినాళ్లు బవరంబు సేయ
నెవ్వీరునకుఁ జెల్లు నతఁడెంత సేసె
నెవ్వరొకో! అని యిచ్చలోఁ దలఁచి
యంబుజోదరు నట నాత్మలోఁ దెలిసి
జాంబవంతుఁడు భక్తి సాష్టాంగ మెఱఁగి
చేతులు మొగిడించి శిరసునఁ దాల్చి.
యాతతప్రీతి నిట్లని సన్నుతించె.
“దేవ! జగన్నాథ! దేవేంద్రవంద్య!
గోవింద! కృష్ణ! ముకుంద! సర్వేశ!
నీవాదిమూర్తివి నిగమార్థవిదులు
భావించి కనియెడి పరమాత్మవీవ!
పొరిపొరి బ్రహ్మవై పుట్టింతు జగము!
హరిమూర్తివై నీవె యనిశంబు బ్రోతు!380
హరుఁడవై యడగింతు వఖిలభూతములఁ
బరమాత్మ! నీలీలఁ బ్రణుతింప వశమె?
దశరథాత్మజుఁడవై ధరణిఁ బాలించి
దశకంఠు గెలిచి సీతాదేవిఁ దెచ్చు
శ్రీరాముఁడవు నిన్నుఁ జింతింప మఱచి