ఈ పుట అచ్చుదిద్దబడ్డది
కల్యాణకాండము
83
నని గుణధ్వని సేసి యాఱుబాణములుఁ
దనువుఁ గీలింప దానవాంతకుఁడు
నల్లన నవ్వుచు నతనికేతనము
విల్లునుద్రుంచిన వేరొక్క ధనువుఁ
గొని బాణవర్షంబుఁ గురియఁగ శౌరి
కనిసి తేజుల సూతుఁ గీటణఁగించి
దనువుఁ ద్రుంచుటయు, నాతఁడు వమ్మువోక
ఘనమైన ఖేటకఖడ్గంబుఁ గొనుచు220
హరితేరిపైకి రయంబునఁ గదిసి
కరవాలమున వేయఁ గమలాక్షుఁ డతని
పలుకయు వాలును బాణాష్టకమునఁ
దృణమాత్రమునఁ ద్రుంచి ధృతిమూర్చ వుచ్చి
శ్రీకృష్ణుఁడు రుక్మిని ధ్వజస్తంభమునకుఁ గట్టి తల గొరుగుట
తనపాగఁగొని ధ్వజస్తంభంబుతోడ
మెలివట్టి మెడగట్టి మిడమిడఁ జూడ
నలుకమైఁ బేర్చి పెద్దమ్మున శిరముఁ
బలుపున జుట్టును బాఱఁగ గొఱిగి
యునిచిన భేదంబు నుమ్మలికంబుఁ
బెనుపాటు గదుర నిర్విణ్ణుఁడై యున్న
యన్నను గనుగొని యడలు దీపింపఁ
గన్నుల నీరొల్క గద్గద యగుచు
మొగము వెల్వలబార ముదమున సిగ్గు
వగయుఁ దోఁపఁగ నిల్చి వైదర్భి పలికె.