పుట:Dvipada-Bagavathamu.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

ద్విపదభాగవతము

హలముసలోగ్రబాహార్గళుఁడగుచు
యరదంబు డిగివచ్చి యాసాల్వతేయు
నరదంబు నుగ్గుగా నడిచిన నతఁడు
గదపుచ్చుకొనిఁ సీరిఁ గదియ నాలోన
నదలించి మాగధుఁ డడ్డంబు దాఁకి
శరపరంపర లేయ, జడిసి మాగధుని
హరులను సారథి నవలీలఁ గూల్చె,
తేరిపై నురికి యుద్వృత్తిఁ గంఠమున
సీరంబుఁ దగిలించి చెచ్చెరఁ దిగిచి
రోఁకట నడపఁగ రుధిరంబుఁ గ్రక్కి
వీఁకరి మాగధవిభుఁడు మూర్ఛిల్లె;210
నక్కజంబుగ వాని నరదంబు మీఁద
నెక్కించుకొని సాల్వుఁ డేఁగె నాలోన
నతనితోడనె యఖిలసైన్యములు
నాతురఁబడి గుండెలవియంగ బఱచె.

రుక్మి కృష్ణుని తూలనాడుచుఁ గవియుట


అంతకుమును విదర్భాధీశతనయుఁ
డంతకసముఁడు క్రోధాత్ముఁడై రుక్మి
తనసేనతోడ ముందఱ నేఁగి కృష్ణు
గనుఁగొని భీషణోగ్రస్ఫూర్తిఁ బలికె.
“ఓరి! గోపాధమ! ఓడక నన్ను
జీరికిఁగొనక నా చెలియలిఁ బట్టి
కొనిపోయెదికఁ నెందుఁ గొనిపోయె దీవు?
నిను నాశరంబుల నీరుఁ గావింతు;"