పుట:Domada-Yuddhamu.Somaraju-Ramanujaraopdf.pdf/1

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దోమాడ యుద్ధము

రచన: సోమరాజు రామానుజరావు

పీఠిక


ఇది నీలాద్రిరాయణింగారికిని, పెదమహీపతిరాయణింగారికిని పిఠాపురపురాజ్యంబుకొఱకు దోమాడవద్ద జరిగిన యుద్ధము. చరిత్రాత్మకమైన పద్మనాయక (దోమాడయుద్ధ) కథ. ఇయ్యది బొబ్బిలియుద్ధానంతరమున అయిదారుసంవత్సరములలో (క్రీ॥ శ॥ 1763) జరిగినట్లు దెలియుచున్నది. ఇందు పద్మనాయక సేనానాయకుల ప్రభుభక్తివిశ్వాసంబులును, వారల యవక్రవిక్రమపరాక్రమాదులును వెల్లడి యగుచున్నవి. ఇం దచ్చటచ్చట స్వకపోలకల్పితంబు లుండినను అతిశయోక్తులతోడను, అనవసరమగు వర్ణనాదులతోడను నింపక పండితపామరజనైకవేద్యమగునట్లు సులభశైలిని వ్రాసినందుల కెంతయు సంతసంబగుచున్నది. ఈచరిత్రంబును చిత్రాడపురనివాసులగు శ్రీరావు వేంకటరాయిణింగారి జ్యేష్ఠపుత్రులగు శ్రీరావు సత్యనారాయణమూర్తి గారు చెన్నపురి 1919 సం॥ లో కార్యార్థమై యరిగినప్పుడు ఓరియంటల్ లైబ్రరీలో మెకంజీ వాల్యూము నెం 5 రు జల్లూరు కైపయతునుండి సంపాదించితిమనియు, నద్దాని నవలారూపకముగ పెక్కు ఆంధ్రనవలాగ్రంథకర్త యగు సోమరాజు రామానుజరావుగారిచే వ్రాయించితిమనియు, లోకంబునకు వెల్లడి యగునిమిత్తమై శ్రీరామవిలాసగ్రంథమాలికయందుఁ బ్రకటించుఁడని కోరి 10-9-21 సంవత్సరమున మా కొసంగిరి. మూలను దాగి యున్న యీసుప్రసిద్ధచరిత్రమును బయటబెట్టిన శ్రీరావు సత్యనారాయణమూర్తిగా రెంతయుఁ బ్రశంసనీయులు. వారి భాషాభిమానమును వెల్లడించినందులకై వారి కెంతయుఁ గృతజ్ఞులము. ఈచరిత్రయం దుండు పాపయ్యగారివల్లనే యిప్పుడు ప్రస్తుతము చిత్రాడ గ్రామములో పాపయ్యగారితోట, చెఱువు అని పిలువఁబడునవి యీయనచే నిర్మింపబడినవని చెప్పఁబడుచున్నవి. ఇంకను యీయుద్ధములో చనిపోయిన యినుపాలవారు అనే వెలమదొరలయొక్క నివేశసస్థలమును, చిత్రాడ పొలిమారవద్ద వారిపేరున పిలువఁబడుచున్న తోటయును గలవు. గంగాధరుఁడు చేసిన కుట్రలగుఱించి బంధుజనంబుల మరణములగూర్చియు కీర్తిశేషులైన పీఠికాపురాధీశులగు శ్రీ రాజా గంగాధర రామారావుగారు కూడ వగచుచు అవసానకాలమువఱకు దూషించుచుండిరట. ఇందు నెలుసులుండిన దెలిపినయెడల ద్వితీయముద్రణంబున సవరించుకొనియెద.

చిత్రాడ,

ఇట్లు,

4-10-21.

చెలికాని లచ్చారావు.