పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధనుర్విద్యావిలాసము

33


ఉ.

ఘ్రాణపుటమ్ములుం బొమలు కర్ణయుగంబులు చూచుకంబులున్
బాణులు కన్నుదోయి మణిబంధపుయుగ్మము కూర్పరంబులున్
శ్రోణులు జానులున్ బదసరోరుహముల్ వృషణావటుస్థలుల్
క్షోణి సమానవైఖరులఁ జొప్పడువాఁడు మహీశ్వరుండగున్.

133


ఉ.

ఈదృశరాజచిహ్నముల హెచ్చులు గుల్కెడు రాకుమారకుం
బోదన చేసి రాఁదిగిచి భూరిదయాభ్యుదయంబునన్ ధను
ర్వేదకళానిరూఢి వివరించిన నంచితశౌర్యధుర్యుఁడై
యాదట నక్కుమారుఁ డుదయార్కుని కైవడిఁ బ్రోచు లోకమున్.

134


వ.

అనిన విని యుధిష్టిరానుజుం డాచార్యుని కిట్లను, మహాత్మా! పురా
తనరాజకుమారులయందు శాస్త్రోక్తంబులగు మహాపురుషలక్షణం
బుల నుపలక్షితుండై ధనుర్విద్యాలాభంబునం గోదండదీక్షాగురుం
డును, సార్వభౌముండును నై ప్రజాపరిపాలనంబునం దేజరిల్లువాఁ
డెవ్వం డతని గుణలక్షణప్రకారంబులు వినవలతుం జెపుమనిన కుంభ
సంభవుం డిట్లనియె.

135


క.

సోమద్యోమణి కులముల
క్షేమంబున నుదయమందు క్షితిపతి సుతులం
దీమహి శుభలక్షణముల
రాముఁడు పరిపూర్ణుఁడగుచు రాజిలుచుండెన్.

136


మ.

విలసద్బుద్ధివ శేషశాలి శు వాగ్విస్తారుఁ డాలోడితా
ఖలనీతిప్రకరుం డుదారుఁ డుదరగ్రీవుండు సుస్నిగ్ధుఁడున్
సులలాటుండు సువిక్రముఁడు సుశిరస్కుండు సుగాత్రుండు వ
త్సలుఁ డాజానువిలంబిబాహుఁడు ఘనస్కంధోజ్జ్వలుం డాదటన్.

137


శా.

యోధాగ్రణ్యుఁడు గూఢజత్రుఁడు విశాలోరస్థలుండు సము
త్సేధుండు మృగరాజమధ్యుఁడు సమాశ్లిష్టాంగుఁడుం దీర్ఘబా
హాధుర్యుండు మహాహనుండు నవపద్మాక్షుండు భాస్వత్కటి
ప్రోధుండుం శుభలక్షణుండు గుణసంపూర్ణుం డుదీర్ణుం డిలన్.

138