పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధనుర్విద్యావిలాసము

17


కొని విన్నాణముగాంచి భావనలచేఁ గోదండదీక్షాగురున్
నను మెప్పించిన మేటివీన ధరణీనాథావతంసాగ్రణీ.

66


సీ.

ఋగ్వేదమును యజుర్వేదంబు మఱి సామ
        వేదం బధర్వణవేద మనఁగ,
నాల్గువేదంబులు నాల్గువిద్యలు తదీ
        యాంగముల్ శిక్షాదు లాఱువిద్య,
లనల మీమాంసయు న్యాయవిస్తరము పు
        రాణంబు ధర్మశాస్త్ర మివినాల్గు,
గాఁక నాయుర్వేదకార్ముకవేదగాం
        ధర్వనీతిప్రబోధములు నాల్గు,


తే.

వెరసి పదియును నెనిమిది విద్య లభవు
డఖిలలోకైకహితముగా నాది నుద్ధ
రించె నీవిద్యలందు పార్థివుల కధిక
విభవముల నిచ్చు నిద్ధనుర్వేద మవని.

67


వ.

అట్లగుటం జేసి.

68


క.

అలయష్టాదశవిద్యలు
గల దిద్ధనురాగమంబు గణనీయంబై
బలువిడి నిది కావ్యముగా
వెలయింపుము నీదుకీర్తి వెలయం దిరమై.

69


ఉ.

మానధనాగ్రణీ వినుము మాదృశహృద్యములైన సప్తసం
తానములందుఁ గావ్యము సనాతనమై ఘనమై తనర్చుటన్
మానవుఁ డెవ్వఁడేని సుషమంబగు కావ్య మభీష్టదేవతా
ధీనము సేయ నాయతగతిం జగతిం బొలుపొందుఁ బొందుగన్.

70


మ.

నరుఁ డాకుంభజు వేఁడినట్లు గురుఁ డానందనంబునం గ్రీడితో
బరిపాటిన్ వినిపించినట్లుగఁ గ థాభాగంబు భాగించి క్రొ
వ్విరులం దేనియగూర్చుకైవడి ధనుర్విద్యావిలాసాహ్వయం
బొరయం గావ్యము మాకు నర్పణముగా యోజింపు ముత్సాహివై.

71