పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/67

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ

ధనుర్విద్యావిలాసము

కృత్యవతరణిక

శా.

శ్రీవాణీగిరిజావిలాసనిధియై చెల్వొందు సీతామహా
దేవిం దక్షిణభాగమం దనుజు నర్థిన్ వామభాగంబునన్
ఠీవి గైకొని చాపరోపధరుఁడై ఠేవన్ బిసాళించు ల
క్ష్మీవంతు న్గుణవంతు నీవనిపుర శ్రీరాఘవుం గొల్చెదన్.

1


సీ.

ఏబాలికామణి హేలావతారంబు
        మిథిలాధిపతిమేలు మేలుకొల్పు
నేభామపరిణయ శ్రీభాగధేయంబు
        శివధనుర్దళన ముంకువ ఘటించు
నేమహాదేవీలలామంబు కరుణతో
        నింద్రాదిదివిజుల యిడుము లుడుపు
నేవధూత్తంసంబు హితలీల రాముల
        వామాంకపీఠంబు వదలకుండు


తే.

నేపరమసాధ్వి గుణము లీరేడు జగము
లందుఁ గులపాలికలకు నానందకరము
లట్టి సీతావధూటి నెయ్యంబు మీఱ
ప్రథనజయ మిచ్చు తిరుపతిరాయమణికి.

2


ఉ.

కోసలరాజనందనునకుం బరిచారకుఁడై నివాసశ
య్యాసనపాదుకాంశుకసితాతపవారణకల్పనావిధిన్
భాసిలి శేషభావ మనుబంధముగాఁ దగు లక్ష్మణుండు ధా
త్రీసురపోషకుం దిరుపతిక్షితిపాలునిఁ బ్రోచుఁగావుతన్.

3