పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1443 మొదలు 1470 వరకు 27 సం॥లు పాలించెను. విజయనగరంలో అప్పుడు పరిపాలించుచున్న రామరాజయ్యదేవమహారాయలను 1487లో తురకలు చంపి రాజ్యము స్వాధీనము చేసుకొని మల్కిరాయపాదుషావారు పరిపాలించుచూ ముర్త్యుజ అనే తురకను ఈదేశానికి పరిపాలనకు పంపిరి. అతను దేవాలయములు పడగొట్టి గోపీనాథపురమునకు ముర్తుజానగరమని పేరిడి రాజ్యము చేయుచుండగా శ్రీ వీరప్రతాపతిరుమలదేవరాయలు కృష్ణయావలనున్న మొగలులను జయించి సామ్రాజ్యానికి వచ్చి ఆనెగొంది తిరుమల దేవరాయల పుత్రులయిన శ్రీరంగరాజయ్యకు ఈ దేశానికి ప్రభుత్వం కట్టిరి. ఆయనే కృష్ణాతీరమందున్న మూరంపూడి అనే గ్రామమును గంగాధర రామేశ్వరస్వామివారికి దానం చేసిరి. ఇది 1474లో జరిగెను. అజరత్ విభురా పాదుశాహావారు కృష్ణా ఆవలిభాగం ప్రభుత్వం చేస్తూయుండిరి. కర్ణాటక పాదుషాహా శ్రీరంగరాయలను జయించి కృష్ణ దక్షిణదేశ మందున్న వినుకొండ మొదలైన సాధించవలెనని రాయరావు అనే బ్రాహ్మడికి సేన ఇచ్చి పంపగా ఆయన వినుకొండ, బెల్లంకొండ, నాగార్జునకొండ, మాచెర్లసీమ జయించి వెలమవారు పరిపాలించుచున్న నేలకోట కొబ్బెర్లతోట జయించి అద్దంకి, అమ్మనబ్రోలు, కందుకూరు, పొదిల, దరశికంభం, కాకర్ల, తూపాడు, తంగేడు, గురజాల, కేతవరం, కోడెపూడి మొదలైన నేలకోటలను జయించి కొండవీటిని ముట్టడించగా రాయలవారి ముతాలీమతులై ? ముఠాధిపతులైన? వెలుగోటి తిమ్మన్న లోబడి రాయరావుకి అధీనుడైనాడు. 1502లో స్వాధీనపరచుకొని 1504వరకు పరిపాలించి గోల్కొండకు వెళ్లెను. గోల్కొండలో ఉన్న అజరత్ గారు ఇక్కడ మన పూర్వీకుడు ముర్తుజాచే గట్టపడిన పట్టణము బాగుగా కట్టించెను. వినుకొండ, బెల్లంకొండ మొదలయిన దుర్గముల వ్యవహారములుగూడ ఇక్కడ జరుగునట్లు యేర్పాటు చేసి దీనికి ముర్తుజానగరు సర్కారని పేరిడి కొండవీటి సీమనంతయు 14 సమతులు చేసినారు. పాలడ్లు, పులివఱ్ఱు, ప్రతిపాడు, సంతరావూరు, నూతక్కి, చీరాల, పాణం, మంగళగిరి, మునిగోరు, నాదెళ్ల, రావిపూడి, కూచిపూడి, గుంటూరు, తాడికొండ ఈ విధముగ 44 గ్రామాదులను 14 సమతులు చేసిరి.