పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగున మూడాశ్వాసములప్రబంధముగా కృతిప్రేరకుని యిలవేల్పయిన యీవని కోదండరామదేవున కర్పితముగా నీగ్రంథము రచియించినాఁడు. కృతిపతి వెలసియున్న యీవని గ్రామము గుంటూరు మండలమున తెనాలి తాలూకాలో నున్నది. ఈగ్రంథమునకు,

కృతికర్త

కృష్ణమాచార్యుఁడు. ఈతని నివాసగ్రామ మేదో తెలియరాదు. ఈధనుర్విద్యావిలాసమునే కాక శకుంతలాపరిణయ మని మరొకప్రబంధమును గూడ నీతఁడు రచించినాఁడు. [1]శకుంతలాపరిణయము నీతఁడు చిరుమామిళ్ల పాపయ్య ప్రభుఁడని నామాంతరముగల వెంకటాద్రినాయనింగారి ప్రేరణమున తిరుపతి వెంకటేశ్వరస్వామి కర్పించినాఁడు. అందా పాపయప్రభుని వంశవిస్తర మెల్ల వర్ణింపబడినది. చల్లపల్లి జమీందార్లగు నేర్లగడ్డవారికిని, ముక్త్యాల, అమరావతీ ప్రభులగు వాసిరెడ్డివారికిని చిరుమామిళ్లవారు దగ్గర బంధువులు. నేటికిని నది సాగుచునే యున్నది. చిరుమామిళ్ల వంశ్యులు, నాయఁడమ్మగారు, పాగోలు వాస్తవ్యులుఁ చల్లపల్లి శ్రీశివరామనృపునకుఁ చిన్నతల్లిభర్తయు, ముక్తాల శ్రీచంద్రమాళీశ్వర ప్రభునకు భావుకుఁడునై వర్ధిల్లుచున్నారు. శకుంతలాపరిణయమున గ్రంథకర్త తన్ను కృష్ణకవి యనియు ధనుర్విద్యావిలాసమున గృష్ణమాచార్యుఁడనియుఁ బేర్కొన్నాఁడు. శకుంతలాపరిణయమునాఁటి యీతనివై ష్ణవత ధనుర్విద్యావిలాసమునాటికి క్రమపాకము పొందినదిగాఁ బోలును. పేళ్లు మార్పునుబట్టి రెండు గ్రంధములకుఁ కర్తలు వేర్వేరువా రగుదురేమో యని సందేహింపరాదు. ఈనామభేదమే కాని రెండు గ్రంథముల గద్యములు సమానముగానున్నవి.

"ఇది శ్రీమత్కౌసల్యానందనప్రసాదసమాసాదితకవితావిచిత్ర మైత్రేయసగోత్ర నృసింహగురుపుత్ర కృష్ణమాచార్య ప్రణీతంబైనఁ

  1. దీనిని పనప్పాకం శ్రీనివాసాచార్యులుగారు 1894 లో ముద్రించిరి.