పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధనుర్విద్యావిలాసము

111


కమ్ములకుం బ్రహర్షించుచు వేదానువాదమ్ముల మోదమ్ములు
గూర్చు సాంగవేదులును సాంగవేదుల కుఱుంగటి కిసలయసేవంతికా
లవలీకువలయారవిందనానావిధకుసుమవిసరంబులును, వివిధ
వర్ణంబులగు హరిద్రాదిభద్రచూర్ణంబులును,బొంకంబులగు
సాంకవకర్పూరకర్చూరకుంకుమాదిసురభిళభవ్యద్రవ్యదివ్యాస్త్ర
చందనపంకంబులును, నూతనంబులగు వజ్రవైడూర్యాదిరత్నంబు
లును, శ్రీలంబులగు కాంచనదుకూలంబులును, బరిమళోదారంబు
లగు జలపూరంబులును, లోనుగాఁ బ్రశస్తవస్తుసంఘాతంబులకుం
బాత్రమ్ములగు కనకపాత్రమ్ములు కరతలంబుల నమర్చికొని, మాంగ
ల్యగానంబుల వీనులకు వినోదంబులు గూర్చు భూసురపక్ష్మలాక్షీ,
నికరంబులకుం దరణికిరణప్రసారంబులు సోకనీక శరచ్చంద్రచంద్రి
కాభంబులగు నుల్లాభంబులం బట్టిన పరిచారకనివహంబులును, బరి
చారకనివహంబులకుం బురస్సరులై సమవయస్కులగు రాజనందను
లిరుగెలంకులం గొలువ నగ్రభాగంబున మాల్యాంబరాభరణ
భూషితుండును, శిరస్త్రాణతనుత్రాణతలత్రాణకలితుండునునై
కనత్కనకమణిగణకలాకలాపంబులగు శరచాపంబులు ధరియించి,
మదకలశుండాలంబులీల మందయానంబునన్ ధనురాచార్యుండు నడు
వ నుదంచిత్సాహంబునం బొడలుచు, నఖండితాఖండలవైభవం
బున ఖురళిరంగద్వారంబుఁ జేరంజని, పరిఖాపరివారితతప్తకార్త
స్వరభాస్వరవర్ణంబును, మరకతమణిఖచితమంచకశ్రేణీ
సముదంచితంబును, లంబమానముక్తాఫలమంజరీసమంజసోల్లాభ
శోభితంబును, తరుణారుణకిసలయతోరణస్ఫారితచతుర్ద్వారంబును
నిరంతరాలేపితఘనసారచందనాగరుపరిమళఘుమఘుమితంబు
నునై, విలసిల్లుచు సదాశివస్థేమంబులీల సర్వమంగళాభిరామంబై ,
రామవిజయంబులీల సుమిత్రానందనాశ్రయంబై , సరోవరంబులీలఁ
బద్మరాగోపశోభితభువనంబై , శింశుమారంబులీల సూర్యావరణీ
యంబై , యలకానగరంబులీల రాజరాజాభిరక్షితంబై , మెఱుం
గులు తుఱంగలించు రంగమధ్యంబుఁ బ్రవేశించి వేదవేదాంగాది