పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

శరనిర్మాణము


నీక శింజిని మొరయించి నిలుపుఁగాక
కాక కరతలమున కంటనీక శరము.

97


వ.

ఇవ్విధంబున కార్ముకముష్టిప్రకారంబులు బ్రవర్తిల్లుచుండు, నింక
స్థానప్రతిష్టానలక్షణవినియోగంబు లుపన్యసించెద నాకర్షింపుము.

98


శా.

ఈశానుండు గుహుండు భార్గవకులాధీశుండు రామక్షమా
ధీశుండుం మొదలౌ ధనుర్ధరకులాధీశుల్ శరాభ్యాసముం
దా శంకింపుదు రైదునిల్కడలు ప్రత్యాలీఢ మాలీఢమున్
వైశాఖంబు సమంబు మండల మనన్ నామంబు లైదింటికిన్.

99


సీ.

ఎడమపాదము లక్ష్య మెదురుగా మున్నిడ
        నవనిఁ బ్రత్యాలీఢ మైతనర్చు,
గుఱిఁకిఁ జక్కన గాఁగఁ గుడికాలు మున్నిడ
        నాలీఢ మారూఢమై తనర్చు,
పుడమి మూరకొలంది యెడముగా నంఘ్రిద్వ
        యము నిల్ప వైశాఖమై తనర్చు,
నడుమ నంగుళయుగ్మ మెడముగా నిలిచిన
        నది సమస్థానకం బై తనర్చు,


తే.

నిల సమస్థానమున నుండి యడ్డముగను
దోరణాకృతి నడుగులదోయి ద్రిప్పి
యభయ పార్ష్ణిముఖంబులు నొరయ నిలుప
మహిఁ దనరుఁ దోరణాకృతి మండలంబు.

100


వ.

వెండియు ధనుర్ధరుం డయ్యైస్థానంబుల నిలుచు విన్నాణంబులును
దత్తద్వినియోగంబులు నుపన్యసించెద నాకర్ణింపుము.

101


మ.

తెఱఁగారం గుడిపాద మడ్డముగ ధాత్రిన్ నిల్పి తద్గుల్ఫముం
గుఱిగా మూరెఁట వామపాద మిడి యంగుష్ఠంబు పైఁ జక్కఁగా
గుఱికిం గార్ముకముష్టి సాచి శర మక్షోభంబుగా నేయున
త్తఱి నీస్థాన మధీనమై తనరుఁ బ్రత్యాలీఢనామంబునన్.

102