పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

నారాచనిర్మాణము


వ.

వెండియు నిట్టి సకలవిధంబులగు శరంబులకుం బ్రమాణంబులు నిరూ
పింప నుపాయంబుగల దాకర్ణింపుము.

217


మ.

జ్యాలతమానమున్ మఱియు శార్ఙ్గపుమానము రెండు నొండుగా
దేలిచి మూఁడుభాగములు దీర్చుచు నందుల నొక్కభాగమున్
హాలి శరప్రమాణమగునం చల భార్గవరాముతోడ గౌ
రీలలనావిభుండు వివరించె జగద్ధితకార్యధుర్యుఁడై.

218


వ.

అట్లగుటం జేసి మౌర్వీశరాసనమానంబు లొక్కటిగాఁ గలయం
గూడి యది మూఁడుభాగములుగా విభజించి యం దొక్కభాగంబు
కొలంది శరంబులమానంబు నినుపందగు ననిన విని పాకశాసనతన
యుం డాచార్యున కిట్లనియె.

219


క.

నాలుగు కొలఁదుల శరములు
నాలుగు కొలఁదుల శరాసనంబులు గా మున్
బోలించితి రేధనువున
నేలాగునఁ గూర్పవచ్చు నిషువుల కొలఁదుల్.

220


వ.

అనిన నాచార్యుం డిట్లనియె.

221


సీ.

పదియాఱుముష్టుల బాణాసనమునందు
        తెగువ బాణంబులు దివియవలయు,
పదియేనుముష్టుల బాణాసనమునందు
        దూరపాతిశరంబుఁ దొడగవలయు,
పదునాల్గుముష్టుల బాణాసనమునందు
        నారాచనికరంబు నడుపవలయు,
పదుమూఁడుముష్టుల బాణాసనమ్మునం
        దిలఁ దులాదండేషు వేయవలయు,


గీ.

నే కొలది బాణ మేవింట నేయవలయు
నా కొలఁది బాణ మావింట నాకలించి
కొలఁది వివరించినట్లుగాఁ గూర్తురేని
తొడిగినశరంబు చక్కఁగా నడుచుచుండు.

222