పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

59

యుండ లేదు. తనకార్యమును వంచనలేక నేటివేర్చుచు హిందూదేశమున పర్యటనముసలుపసాగెను. బొంబాయినగరము, పూనానగరములోనగు మహా పట్టణములయం దుపన్యాసములు గావించి జనులెల్లఱును వశీకృతులఁ గావించుకొనుచుండెను.

మేనెలలో మరల కాంగ్రెసు కార్యనిర్వాహక సభకూడి స్వరాజ్యకక్షవారు శాసనసభలకు నిలిచినయెడల కాంగ్రెసుపక్షమువా రెవ్వరును కాంగ్రెసుతరఫున వారికి ఓట్లనియ్యఁగూడదని చెప్పరాదని తీర్మానించుకొనిరి. ఈకార్యమువలన కాంగ్రెసువారికిని స్వరాజ్యకక్షవారికిని మైత్రిగలిగినది. దేశబంధువుని కార్యము కొనసాగుటకు శుభసూచనలు బొడసూపినవి.

దేశబంధువు ఈనెలలోనే మద్రాసురాజధానికి విచ్చేసి యందుఁ దనయభిప్రాయములను దెలుపఁ బూనుకొనెను. ఈసందర్భమున కాంగ్రెసువారు భేదభావముల వదలి యీతనిని తమరాజధానికి విచ్చేసినందులకు సన్మానపత్రికల నొసగిరి. అతఁడు తమిళ దేశమున ప్రధానపట్టణముల యందెల్ల నుపన్యాసములఁ జేసెను. ఎచ్చటఁ జూచినను జనులు కిటకిటలాడుచు గూడి యాతని యుపన్యాసములను వినుటకు కుతూహలురైరి. చెన్న పురి రాజధానిలో