పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

నిట్టి సందర్భమున కోర్టును వెడలివచ్చెను మన చిత్తరంజనుడు. మఱియు ననేక కేసులను ధనము పుచ్చుకొనకయే వాదించుచుండినను నెలకు విస్తారధనమును సుమారు 50 వేల రూప్యములను గడించు చుండువాఁడు. ఎంతో స్వార్థత్యాగ మొనర్చి రాజకీయ కేసులలో నిందితుల పక్షమున ధనమును గైకొనకయే వాదించును. పంజాబువిచారణ సంఘమునందు నాల్గునెలలు కృషిసల్పి తనస్వార్థ త్యాగ పరాయణత్వమును గాన్పించెను. దేశసేవచేయవలసి వచ్చినప్పుడు తన అత్యధికమైన ఆదాయమును తటాలున వదలుకొని ప్రజలవేనోళ్ల పొగడ్తలకు పాత్రుఁడయ్యెను.

బంగాళాసారస్వతము - చిత్తరంజనుని సేవ.

చిత్తరంజనుఁడు రాజకీయ విషయములలో బ్రవేశించుటకు బహుకాలమునకు మునుపే బంగాళావాఙ్మయమును వృద్ధిపొందించుటలో నాతనిమేధాకౌశలమును వెల్లడించెను. 1895-వ సంవత్సరముననే బంగాళా భాషలో 'మలంకా' అనుగీతముల నాతఁడు రచించెను. ఈగీతములు వంగీయులకు స్వాభావికముగనే స్వాతంత్ర్యాభిలాషను జనింపఁ జేసినవి. 'మలంకా'లో కొన్ని గీతములు నాస్తికవాదమును బలపరచుచుండినదని చిత్తరంజనుని మీద