పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు 89

సన్ననికత్తులను గట్టి, రెండు పుంజులను డీకొలిపి విడిచెదరు. అవి రెండును ముందు వెనుకలకు నడుచుచు ఎగురుచు కత్తులను గట్టిన కాళ్లతో రొమ్ములపై తన్నుకొనుచు పోరాడును. రక్తము ధారగ కారుచున్నను అవి పోరాటమును విడువవు. ఈ ప్రకారము పోరి కొంతసేపటికి యొక కోడి క్రింద కూలును. గెల్చినవాడు చచ్చినకోడిని తీసుకొనిపోయి రాత్రికి విందు భోజనమును చేయును. ఇది పల్లెటూర్ల పండుగ సంబరము. నాటికి సంబరమేగాని - కోడి పందెముల పగలు సామాన్యముగా వాటితో చావవు. పోరాటము సాగుచున్నప్పుడు చూచువారు, రెండుకక్షలై పౌరుషపు మాటలతో ఆయా పుంజులను రెచ్చగొట్టి హుషారిచ్చుచుందురు. కోడిపుంజులును నైజముగనే రోషముతో పోరుచుండును. పండుగ సంబరమున కొంచెము మత్తు పదార్ధములు పుచ్చుకొని అసలే హుషారుగా నున్న ఆ గ్రామస్తులు ఈ రోషపు మాటలతో తామసము వహింతురు. పైగా ఆ కోళ్లపై కొందరు పదులు, నూర్లు పందెములు కాయుదురు. వానిని ధారపోసుకొన్నప్పుడు ఈ తామసము మించిపోవును. దానితో వారు కలియపడి కొట్టుకొనుటయు కద్దు. లేదా, సంవత్సరము పొడవున కక్షలు పెంచుకొని అప్పుడప్పుడు కొట్లాడు కొనుటయు కలదు. ప్రసిద్ధి చెందిన పల్నాటి వీరయుద్ధమునకు మూలము 'కోడి పుంజుల పందెమే' యని చరిత్రకారులు చెప్పుదురు. సామాన్య జనమునకు ఇవి సరదాగా నున్నను సౌమ్యులు వీనిని రేసుకోర్సులను వలెనే ప్రోత్సహింపరు.

మా వూరి రంగిరీజులలో కొందరు మంచి కోలాటపు పాటలు నేర్చిన వారును గలరు. అప్పుడప్పుడు పెద్దగుంపుగ కూడి ఒక దీప (గరుడ) స్తంభమును వెలిగించి దాని చుట్టు వీరు చేరి కోలాటమును వేయుచుందురు. లయతప్పక కర్రదెబ్బలను గట్టిగ వేయుచు, ఎగురుచు, దూకుచు, తిరుగుచు, ఇప్పటి స్కూళ్లలో ఆడపిల్లకాయలు కోలాటము జడను అల్లువిధముగ ఆడుదురు. వీరు మొదట