88 చిన్ననాటి ముచ్చట్లు
ఈ రంగులన్నియు గట్టిఛాయలని పేరు. గుడ్డచినుగువరకు రంగులు పోవు. ఆ కాలమున మనదేశమున లభించు కరక్కాయ, నీలిమందు, చిరివేరు, పబ్బాకు, మంజిష్ఠ మొదలగు వనమూలికలతో రంగులు వేయుచుండిరి. ఈ పరిశ్రమకు మా ఊరున్నూ (ఇనమన మెళ్ళూరు) గొల్లపాలెం, బందరు, చీరాల, కరేడు, నెల్లూరు ఆరోజులలో మిక్కిలి ప్రసిద్ధి వహించి యుండెను. చెన్నపట్నం ప్రక్కనయుండే సైదాపేటలోకూడ ఈ రంగులను వేయుచుండిరి. ఈ పరిశ్రమ క్రమముగా నశించిపోయినది. విదేశీ కృత్రిమపు రంగులు వచ్చి మన మూలికల సంబంధమగు రంగుల పరిశ్రమను ఎట్లు ధ్వంసమొనర్చినదియు, ఆచార్య ప్రపుల్లచంద్ర రాయి గారును, ఆనంద కుమారస్వామి గారును, విశేషముగా వ్రాసియున్నారు. బందరులో తయారుచేసిన రంగు చీరెలను మద్రాసు పచ్చయప్ప కళాశాల ప్రక్కన యుండు వీధిలో అమ్ముచుండిరి. అందువలన ఆ వీధికి బందరువీధి అని పేరు కలిగెను. ఆ వీధికి మునిసిపాలిటీ పేరు గురువప్పవీధియని బోర్డుయుండినను వాడుక బందరువీధి యనియే పేరు. ఈ వీధిలో ముందు అరటిపండ్లను విస్తారముగ విక్రయించుచుండినందున అరటిపండ్ల వీధి అని కూడ పేరు కలదు. ఈ వీధిలో నేను చిన్నతనమున చదువుకొనుచుంటిని.
సంక్రాంతి పండుగను పెద్దపండుగ అందురు. అప్పడు వ్యవసాయపు పనులు కొంచెము తక్కువ. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ వరుసగా పండుగ రోజులు. ఆ రోజులలో గ్రామస్తులు ఆటపాటల ప్రొద్దుపుచ్పుదురు. అందులో పెద్దపండుగ రోజున మా వూరి రంగిరీజులు యేటివడ్డున యున్న చింతతోపులోనికి పోయి కోడిపందెముల నాడేవారు. మంచి కోడిపుంజులను ఈ పండుగ కొరకు ప్రత్యేకముగ పెంచి యుంచేవారు. వీటిని ఆ తోపులోనికి తీసుకొనిపోయి, వాటికాళ్లకు